ధోని నన్ను జట్టు నుంచి తప్పించాడు.. అప్పుడే ఫిక్స్ అయ్యా.. కానీ.. : సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

First Published Jun 1, 2022, 6:53 PM IST

Virender Sehwag: ధోని  తనను జట్టులోంచి తప్పించాడని.. అందుకే అప్పుడే రిటైర్ అవుదామని అనుకున్నానని టీమిండియా  డాషింగ్ ఓపెనర్  వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

భారత జట్టు గర్వించదగ్గ ఓపెనర్లలో ఒకడిగా ఉండే  మాజీ  ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ధోని.. తనను జట్టులోంచి తప్పించాడని, ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని చెప్పాడు. 

తాజాగా అతడు క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘2008లో  మేం (భారత జట్టు) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాం. అప్పుడు దాని (రిటైర్మెంట్) గురించి ఆలోచన వచ్చింది. ఆ టైం లో నేను ఫామ్ కోల్పోయాను. అయితే టెస్టులలో 150 స్కోరు చేశాను. 

Latest Videos


కానీ వన్డేలలో మాత్రం ఐదారు మ్యాచులలో కూడా  తక్కువ పరుగులకే ఔటయ్యాను. దీంతో ఎంఎస్ ధోని నన్ను తుది జట్టులోంచి తప్పించాడు. అప్పుడే నేను ఫిక్స్ అయ్యా. వన్డేలకు రిటైర్మెంట్ చెప్పేసి కేవలం టెస్టులు ఆడదామని నిశ్చయించుకున్నా. 

అదే విషయం సచిన్ కు చెప్పా. కానీ సచిన్ నన్ను వారించాడు. టెండూల్కర్ నాతో.. ‘ఇది నీ  కెరీర్ లో ఒక క్షీణ దశ. కొన్నాళ్లు ఆగు. ఓపిక పట్టు. ఇంటికెళ్లి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకో. బాగా ఆలోచించు.  అప్పుడు రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకో..’ అని చెప్పాడు.  అదృష్టవశాత్తు నేను తిరిగి ఫామ్ లోకి వచ్చాను. రిటైర్మెంట్ నిర్ణయం మానుకున్నాను..’ అని తెలిపాడు. 

2008 లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. శ్రీలంకతో కలిసి ట్రై సిరీస్ ఆడింది. ఆ సిరీస్ లో నాలుగు మ్యాచులు ఆడిన సెహ్వాగ్.. 6, 33, 11, 14 స్కోర్లు చేశాడు. రెండు మ్యాచులు గ్యాప్ ఇచ్చి తిరిగి అవకాశమిచ్చినా వీరూ అదే రీతిలో ఔటై పెవిలియన్ చేరాడు. 

ఆ సిరీస్ ను భారత్ చేజిక్కించుకున్నా  వీరూ బ్యాటింగ్, ఫామ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే  తర్వాత సెహ్వాగ్ మళ్లీ ఫామ్ అందుకుని వన్డే ప్రపంచకప్ తో పాటు 2013 వరకు భారత జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  

click me!