నేను ఆడేది ఆరో స్థానంలో.. అప్పుడు ఆచితూచి ఆడటం కుదరదు : దీపక్ హుడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 4, 2023, 12:15 PM IST

INDvsSL Live: శ్రీలంకతో తొలి మ్యాచ్ లో భారత్  తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో  భారత్ ఆ మాత్రం స్కోరు చేయడానికి ముఖ్య కారణం  ఆఖర్లో  యువ ఆల్ రౌండర్ దీపక్ హుడా మెరుపులే. 

శ్రీలంకతో వాంఖెడే వేదికగా ముగిసిన తొలి టీ20లో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు   77 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న హార్ధిక్ పాండ్యా  కూడా ఔటవడంతో  94 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత్.. అసలు 140 పరుగులైనా టార్గెట్ పెడుతుందా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. 

కానీ అక్షర్ పటేల్  తోడుగా  యువ ఆల్  రౌండర్ దీపక్ హుడా  రెచ్చిపోయాడు.  23 బంతుల్లోనే  ఒక బౌండరీ తో పాటు   నాలుగు భారీ సిక్సర్లు బాది  స్కోరు బోర్డును 160 మార్కు దాటించాడు.  అక్షర్ తో కలిసి   ఆరో వికెట్ కు 68 పరుగులు జోడించాడు.  అయితే  మ్యాచ  అనంతరం హుడా  తన బ్యాటింగ్, జట్టులో ఫినిషర్ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

హుడా మాట్లాడుతూ.. ‘క్రీజులోకి వచ్చినప్పుడే నాకు స్పష్టమైన అవగాహన ఉంది.  ఒకవేళ  నేను ముందు బ్యాటింగ్ కు వచ్చి ఉంటే  భాగస్వామ్యాలు నెలకొల్పడం గురించి ఆలోచించేవాడిని. నా ఆట కూడా అందుకు అనుగుణంగానే ఉండేది.  కానీ నేను వచ్చింది ఆరోస్థానంలో. అప్పుడు  పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి. 

నిన్నటి మ్యాచ్ లో   కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.  నేను దానికి సిద్ధంగా ఉన్నా.  ఆ సమయంలో హిట్టింగ్ కు దిగితే  ఔట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలా అని నెమ్మదిగా ఆడతామంటే కుదరదు.   వికెట్లు పోయినా ఫర్లేదు బాదాలనే ఫిక్స్ అయ్యా. అయినా మేం  వికెట్లను కోల్పోయే స్థితిలో అయితే ఏం లేం.  అందుకే హిట్టింగ్ కు దిగా. 

వాస్తవానికి ఈ మ్యాచ్ లో మేం మరో 15-20 పరుగులు చేసి ఉండాల్సింది.  కానీ  అలా జరుగలేదు. అయినా చివరికి ఫలితం మాత్రం సంతోషాన్నిచ్చింది.  మంచి  బంతులను గౌరవిస్తూనే  గతి తప్పిన బంతులను మాత్రం  బౌండరీ దాటించాల్సిందే.   నేను, అక్షర్ అదే చేశాం..’ అని   అన్నాడు. 

నిన్నటి మ్యాచ్ లో అక్షర్ - దీపక్ కలిసి  ఆరో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  తద్వారా  2009లో ఇంగ్లాండ్ పై ఎంఎస్ ధోని - యూసుఫ్ పఠాన్ లు  నెలకొల్పిన   రికార్డును  చెరిపేశారు. ధోని - యూసుఫ్ లు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో  ఆరో వికెట్ కు (టీ20లలో)   కు 67 పరుగులు జోడించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ - హార్ధిక్ పాండ్యాలు 2021లో   ఇదే ఇంగ్లాండ్ పై ఆరో వికెట్ కు 70 పరుగలు జోడించి అగ్రస్థానంలో ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాపార్డర్ వైఫ్యలంతో  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే  చేయగలిగింది.  దీపక్ హుడా (41 నాటౌట్), ఇషాన్ కిషన్ (37), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రాణించారు.  ఆ తర్వాత  శ్రీలంక.. 20 ఓవర్లలో  160 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ఫలితంగా  భారత్ రెండు పరుగుల తేడాతో విజయం  అందుకుంది. 

click me!