ఆ ఇద్దరి ఎంట్రీతో టీమిండియా అరుదైన ఘనత.. ఆసీస్ తర్వాత మనమే..

First Published Jan 4, 2023, 11:32 AM IST

INDvsSL: ఇండియా- శ్రీలంక మధ్య మంగళవారం రాత్రి  ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో  టీమిండియా విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో  భారత్ తరఫున  ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. 

శ్రీలంకతో   ముగిసిన తొలి టీ20లో  భారత జట్టు తరఫున శివమ్ మావి, శుభమన్ గిల్ అరంగేట్రం చేశారు.   మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్ధిక్ పాండ్యా.. మావికి టీమిండియా క్యాప్ ను అందజేయగా, సూర్యకుమార్య యాదవ్ గిల్ కు  స్వాగతం  పలికాడు. 

ఈ ఇద్దరి  ఎంట్రీతో ఈ మ్యాచ్ లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది.    టీ20లలో  వంద మంది ఆటగాళ్లు ఆడిన రెండో జట్టుగా రికార్డు పుటల్లో చోటు సంపాదించింది.  మావి, గిల్ ఎంట్రీతో టీ20లలో ఇప్పటివరకూ 99 మంది  ప్రాతినిథ్యం వహించగా    వీళ్లిద్దరి రాకతో ఆ సంఖ్య 101కు చేరింది. 

ఇప్పటివరకూ టీ20లు ఆడుతున్న అంతర్జాతీయ జట్లలో ఆస్ట్రేలియా ఒక్కటే టీమిండియా కంటే ముందుంది. ఆస్ట్రేలియా తరఫున 103 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించారు. ఆ క్రమంలో భారత్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 

ఇక ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శివమ్ మావి అదరగొట్టగా  శుభమన్ గిల్ మాత్రం ఫెయిల్ అయ్యాడు.  మావి.. నాలుగు ఓవర్లు  బౌలింగ్ చేసి  22 పరుగులిచ్చి  నాలుగు వికెట్లు పడగొట్టి తన అరంగేట్రాన్ని  ఓ మంచి జ్ఞాపకంగా మలుచుకున్నాడు.  మావి.. తాను వేసిన ప్రతీ ఓవర్ లో వికెట్ తీయడం గమనార్హం. 

కానీ శుభమన్ గిల్ మాత్రం 5 బంతులు ఆడి  7 పరుగులు చేసి వెనుదిరిగాడు.  వన్డేలలో నిలకడగా ఆడుతున్న ఈ కుర్రాడికి టీ20లలో రాక రాక అవకాశం రాగా.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.   ఒక ఎండ్ లో  మరో ఓపెనర్  ఇషాన్ కిషన్  దొరికిన బంతిని దొరికినట్టుగా బాదుతుండగా  గిల్ మాత్రం త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. 

నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాపార్డర్ వైఫ్యలంతో  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే  చేయగలిగింది.  దీపక్ హుడా (41 నాటౌట్), ఇషాన్ కిషన్ (37), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రాణించారు.  ఆ తర్వాత  శ్రీలంక.. 20 ఓవర్లలో  160 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ఫలితంగా  భారత్ రెండు పరుగుల తేడాతో విజయం  అందుకుంది.

click me!