ఏమో మరి.. పంత్ ను ఎందుకు తొలిగించారో నాకైతే తెలియదు : కెఎల్ రాహుల్

First Published Dec 13, 2022, 1:49 PM IST

BANvsIND Tests: టీమిండియా సారథి  రోహిత్ శర్మ గైర్హాజరీలో  కెఎల్ రాహుల్  ను తాత్కాలిక కెప్టెన్ గా నియమిస్తే అప్పుడు  వైస్ కెప్టెన్ గా రిషభ్ పంత్ ను  నియమించేవారు సెలక్టర్లు. కానీ బంగ్లాదేశ్ సిరీస్ లో మాత్రం పంత్ కు వరుస షాక్ లు తాకుతున్నాయి. 

బంగ్లాదేశ్  పర్యటనలో టీమిండియా  యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు  సెలక్టర్లు షాకుల మీద షాకులిస్తున్నారు.  వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు ముందు అతడిని అనూహ్యంగా సిరీస్ నుంచి తప్పించిన   సెలక్టర్లు.. ఇప్పుడు టెస్టు సిరీస్ కు ముందు కూడా అంతే షాక్ ఇచ్చారు. 

రోహత్ శర్మ గైర్హాజరీలో  రాహుల్ కు గానీ  ధావన్ కు గానీ కెప్టెన్సీ ఇస్తే  వైస్ కెప్టెన్ గా  రిషభ్ పంత్ ను నియమించేవారు  సెలక్టర్లు. కానీ బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో మాత్రం అలా జరుగలేదు.  పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కు  ఆ బాధ్యతలు అప్పజెప్పింది.  దీంతో  రిషభ్ పంత్ ను బీసీసీఐ సైడ్ చేస్తుందనే వాదనలు మొదలయ్యాయి. 

తాజాగా పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తాత్కాలిక సారథి  కెఎల్ రాహుల్ స్పందించాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి  ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ..‘వాస్తవంగా చెప్పాలంటే వైస్ కెప్టెన్సీకి క్రైటీరియా (అర్హత) ఏంటో నాకైతే తెలియదు. అయినా వైస్ కెప్టెన్సీ వల్ల  గొప్ప మార్పులేమీ జరుగవు. 

జట్టులో ఎవరి బాధ్యతలు వారికున్నాయి. మేం జట్టుగా ముందుకు వెళ్తాం. వైస్ కెప్టెన్ అయితే ఎవరికైనా సంతోషమే. కానీ దానివల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేవు. పంత్ ను ఎందుకు  ఆ బాధ్యతల నుంచి తప్పించారో నాకు సమాచారం లేదు. 

మా జట్టులో రిషభ్ గానీ  పుజారా గానీ  ప్రతిభావంతులైన ఆటగాళ్లు. టెస్టు క్రికెట్ లో వాళ్లు జట్టుకు ఏం చేశారనేది అందరికీ తెలుసు. అందుకే మేం  ఈ వైస్ కెప్టెన్సీ గురించి పెద్దగా ఆలోచిచండం లేదు. జట్టులో ఒక్కొక్కరు వారి బాధ్యతలను నెరవేరుస్తూ జట్టు విజయానికి కృషి చేయాలనుకుంటున్నాం. అలాగే ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాం...’ అని తెలిపాడు. 

బంగ్లాదేశ్ తో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి  టెస్టు రేపు (బుధవారం)  మొదలుకాబోతుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్  ఫైనల్ కు అర్హత  సాధించాలంటే  తర్వాత ఆడబోయే ఆరు టెస్టులలో కనీసం ఐదు మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది.   దీంతో ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే భావనలో  టీమిండియా ఉంది. మరి రాహుల్ సేనకు  షకిబ్ అల్ హసన్  నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఎలాంటి షాకులిస్తుందో చూడాలి. 

click me!