టీమిండియాలో నాకు స్థానం లేదు.. కానీ ధోనిలా అవుతా : రియాన్ పరాగ్

First Published Jun 14, 2022, 3:56 PM IST

Riyan Parag: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 లో రాజస్తాన్ రాయల్స్ తరఫున  ఆడిన రియాన్ పరాగ్.. సీజన్ లో బ్యాటింగ్ లో అడపాదడపా రాణించాడు.  అయితే అతడి ప్రవర్తన కారణంగా విమర్శల పాలయ్యాడు. 

ఆటపరంగా గాక తన ప్రవర్తనతో ఐపీఎల్ లో అభిమానులకు గుర్తున్న ఆటగాళ్లలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియన్ పరాగ్ ఒకడు. ఈ అసోం కుర్రాడు.. ఐపీఎల్-15లో ఆర్సీబీతో మ్యాచ్ లో హాఫ్  సెంచరీ చేయడంతో పాటు అదే మ్యాచ్ లో హర్షల్ పటేల్ తో గొడవపడి అందరి నోళ్లలో నానాడు. ఆ తర్వాత అశ్విన్ తో పాటు మరికొందరు సహచర ఆటగాళ్లతో కూడా అతి చేసి విమర్శల పాలయ్యాడు.

తాజాగా పరాగ్  తనకు భారత క్రికెట్ జట్టులో చోటు లేదని సంచలన కామెంట్స్ చేశాడు. తాను ఇంకా కుర్రాడినేనని, నిరూపించుకోవాల్సింది చాలా ఉందని తెలిపాడు. స్పోర్ట్స్ తక్ తో  పరాగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Latest Videos


పరాగ్ మాట్లాడుతూ... ‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా నా జట్టుకు విజయాలు అందించడం ముఖ్యం. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో నేను  అలా రెండు మ్యాచులలో చేశాను. కానీ అది సరిపోదు. 

నేను టోర్నమెంట్ లో ఒంటిచేత్తో ఆరేడు మ్యాచులు గెలిపించగలిగితే అప్పుడు నాకు గుర్తింపు వస్తుంది. ఇప్పటికైతే నా పేరు భారత జట్టు  ప్రాబబుల్స్ లో వచ్చినా  నేను దానికి అర్హుడను కాదు.

రాబోయే సీజన్లలో  నా జట్టుకు విజయాలు అందించి నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటా. అంతేగాక నా జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తా..’ అని చెప్పాడు. 
 

తన బ్యాటింగ్ స్థానంపై సంతోషంగా ఉన్నానని చెప్పిన పరాగ్..  ఫామ్ పై మాత్రం హ్యాపీగా లేనని స్పష్టం చేశాడు. ‘మా జట్టులో నా బ్యాటింగ్ స్థానంపై నేను సంతోషంగానే ఉన్నా. కానీ నేను అనుకున్నంతగా బ్యాటింగ్ చేయడం లేదనే బాధైతే ఉంది. 
 

నాకు 6-7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం. ఒకసారి మీరు చూస్తే ఆ స్థానంలో వచ్చి ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో ధోని ఒకడు. అసలు ఫినిషర్ అనగానే  ఎవరి మైండ్ లో అయినా ధోనియే గుర్తొస్తాడు. నేను కూడా అలాగే కావాలని కోరుకుంటున్నా.  వచ్చే సీజన్ నుంచి నా అనుభవన్ని ఉపయోగించి ధోనిలా రాణిస్తా..’ అని చెప్పుకొచ్చాడు. 
 

ఈ సీజన్ లో పరాగ్..  రాజస్తాన్ తరఫున అన్ని మ్యాచులు ఆడాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది మాత్రం 14 మ్యాచుల్లో. ఇందులో 183 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 56 నాటౌట్.  బౌలింగ్ లో కూడా ఒక వికెట్ తీశాడు.  ఈ రెండు విభాగాలే కాకుండా పరాగ్ మంచి ఫీల్డర్. ఈ సీజన్ లో అతడు 17 క్యాచులు పట్టాడు. 

click me!