ఐపీఎల్ నుంచి రోహిత్ కు రూ.178.6 కోట్ల సంపాద‌న - మ‌రి ధోనీ, కోహ్లీలు ఎంత సంపాదించారు?

First Published | Sep 12, 2024, 2:33 PM IST

IPL salary chart: 2008 నుండి 2024 వరకు ఐపీఎల్ నుంచి అందుకుంటున్న వేతనాల విషయంలో రోహిత్ శర్మ భారీగానే సంపాదించాడు. 17 సీజన్లలో రోహిత్ శర్మ ₹178.6 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించి అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు ఎంత సంపాదించారు? 

రోహిత్ శర్మ

2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక అద్భుతమైన క్రీడా వేడుకగా మారింది. తన తొలి సీజన్ నుండి, ఈ లీగ్ ఆటలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా ఆటగాళ్ల సంపాదనకు కూడా గణనీయంగా పెరిగింది. యంగ్ ప్లేయర్లు తమ క్రికెట్ పవర్ ను చూపించడమే కాకుండా దీని ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం క్రికెట్ లో ఐపీఎల్ ఒక లాభదాయకమైన టోర్నమెంట్ అని చెప్పడంలో సందేహం. అందుకే ప్రతి క్రికెటర్ కూడా దానిలో భాగం కావాలని కలలు కంటారు. ఇక్కడ మెరిసిన చాలా మంది యంగ్ ప్లేయర్లు జాతీయ జట్టులోకి వచ్చారు. ఇతర దేశాల ప్లేయర్లు కూడా ఐపీఎల్ లో ఆడి తమ జాతీయ జట్లలో ప్లేస్ ను సుస్థిరం చేసుకున్నారు. 

ఐపీఎల్ తో భారత క్రికెటర్లు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇది గణనీయమైన ఆదాయ వనరుగా మారింది. 2008 నుండి 2024 వరకు చాలా మంది ప్లేయర్లు జాతీయ జట్టులోకి రాకపోయినా అక్కడ అద్భుత ప్రదర్శనలతో తమపై కాసుల వర్షం కురిసేలా చేశారు.

ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ అన్ని సీజన్లను గమనిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలు అత్యధికంగా మొత్తం జీతాలు పొందిన ప్లేయర్లుగా ఉన్నారు. భారత జట్టులోని ఈ ముగ్గురు దిగ్గజాలు 2008 నుండి 2024 వరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడి, ఈ 17 సంవత్సరాల్లో అత్యధిక జీతాలు పొందారు.


ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ హిట్ మ్యాన్  రోహిత్ శర్మ 2011 నుండి ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌ను ఐదు ట్రోఫీ విజయాలకు నడిపించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సూపర్ ఫేమ్ తో పాటు ఐపీఎల్‌లో తన 17 సీజన్లలో రోహిత్ శర్మ ₹178.6 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించాడు. ఈ సమాచారాన్ని ఇన్‌సైడ్ స్పోర్ట్ ధృవీకరించింది. దీంతో ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదించిన భారతీయ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.

కాగా, 257 ఐపీఎల్ మ్యాచ్‌లలో, రోహిత్ శర్మ 43 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలతో సహా 6,628 పరుగులు చేశాడు. అలాగే, 15 వికెట్లు కూడా తీసుకున్నాడు, అతని అత్యధిక స్కోరు 109* పరుగులు. 2013 నుండి 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తూ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా 165 మ్యాచ్‌లు ఆడి 28.62 సగటుతో 4,236 పరుగులు చేశాడు.

అయితే, గత సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించింది ఆ ఫ్రాంఛైజీ. రోహిత్ స్థానంలో గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా కెప్టెన్సీలో ఆశించిన స్థాయిలో ముంబై జట్టు రాణించలేకపోయింది. 

ఎంఎస్ ధోని - ఐపీఎల్ జీతం

ఐపీఎల్ లో అత్యధిక వేతన సంపాధన కలిగిన రెండో ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.  అతని సంపాదన రోహిత్ శర్మ కంటే కాస్త  తక్కువగా ఉంది. ధోని కెప్టెన్సీలోనే చెన్నైై సూపర్ కింగ్స్ టీమ్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. 

ధోని చెన్నై టీమ్ తరపున ఆడుతూ మొత్తం ₹176.8 కోట్లు సంపాదించాడు. ఇక ఐపీఎల్ లో ధోని రికార్డులు గమనిస్తే.. 264 మ్యాచ్‌లలో ధోని 24 అర్ధ సెంచరీలతో 5,234 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో అతని అత్యధిక స్కోరు 84* పరుగులు. ధోని కెప్టెన్‌గా 4,660 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా ధోని నికర విలువ ₹1,040 కోట్లుగా అంచనా.

విరాట్ కోహ్లీ ఐపీఎల్ జీతం

2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ వేలానికి వెళ్లి ఉంటే సంచలనం సృష్టించేవాడు. అయితే, అతను ఎప్పుడూ వేలానికి వెళ్లలేదు. అయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి 17 సంవత్సరాల్లో మొత్తం ₹173.2 కోట్లు సంపాదించాడు. 252 మ్యాచ్‌లలో, విరాట్ కోహ్లీ 55 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలతో సహా 8,004 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 113 పరుగులు. 

విరాట్ కోహ్లీ నికర విలువ ₹1,050 కోట్లుగా అంచనా. అధిక సంపాదన ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ 17 సంవత్సరాల్లో ఐపీఎల్ నుండి ₹173.2 కోట్లు మాత్రమే సంపాదించాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి కింగ్ కోహ్లీ వేలానికి వెళ్లలేదు. ఆర్సీబీ జట్టు తరఫున మాత్రమే ఆడుతున్నాడు. 

ఒకవేళ కోహ్లీ వేలానికి  వెళ్లివుంటే అతని సంపాదన చాలా ఎక్కువగా ఉండేది. మొత్తానికి ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో ధోని, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరి తర్వాత సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, ఏమీ డివిలియర్స్ ఉన్నారు. 

Latest Videos

click me!