Hardik Pandya: ఎక్కడికెళ్లినా అతడు ఉండాల్సిందే.. లేకుంటే ముద్ద దిగదు.. హార్ధిక్ ఫిట్నెస్‌పై ఆసక్తికర విషయాలు

First Published Sep 22, 2022, 6:45 PM IST

Hardik Pandya Fitness: టీమిండియాలో ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ నిత్యం ఒకేరకమైన బాడీ మెయింటెన్ చేస్తున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో  హార్ధిక్ పాండ్యా ఒకడు. మరి హార్ధిక్ ఫిట్నెస్ మంత్ర ఏమిటి..? 
 

ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరు ముగ్గురు మినహా అందరూ ఫుల్ ఫిట్ గా కనిపిస్తారు. కానీ  సన్నగా ఉండటం వేరు.. ఫిట్ గా ఉండటం వేరు. చూడటానికి అంత భారీ ఆకారం లేకపోయినా ఫిట్నెస్ విషయంలో  మొనగాళ్లు అనే జాబితా తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేర్లు టీమిండియా మాజీ  సారథి విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.  ఈ ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్ అనడంలో సందేహమే లేదు. 

కోహ్లీ సంగతి పక్కనబెడితే  హార్దిక్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి..? అసలు అతడు ఏం తింటాడు..? ఎంత తింటాడు..? చూడటానికి కట్టెపుల్లలా ఉన్నా అంత అవలీలగా సిక్సర్లు ఎలా బాదుతాడు..? అనే సందేహాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. 
 

ఫిట్నెస్ కోసం  జిమ్ లో గంటల తరబడి కష్టపడటం ఒక పద్ధతి. మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా ఫిట్నెస్ మేయింటెన్ చేయడం మరో పద్ధతి. అయితే హార్ధిక్ ఈ రెండింటినీ ఫాలో అవుతాడట. జిమ్, గ్రౌండ్ లో చేసే కసరత్తులు కాకుండా తినే తిండి విషయంలో కూడా  హార్ధిక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. 

ఇందుకోసం హార్ధిక్ ఏకంగా ఓ ప్రైవేట్ చెఫ్ నే నియమించుకున్నాడట. హార్ధిక్ ఎక్కడికివెళ్లినా  సదరు చెఫ్.. అతడి వెంటే వెళతాడట. చెఫ్ అంటే ఏదో వంటలు చేసి తినమని చెప్పడం వరకే అనుకుంటే ఫిజ్జాలో కాలేసినట్టే.. సదరు చెఫ్ గారు వివరం తెలిసిన చెఫ్ అన్నమాట. 

అంటే ఏ టైంకు ఏం తినాలి..? ఎంత తినాలి..? తినే ప్రతిఒక్క ఆహార పదార్థంలో క్యాలరీలు ఎన్ని ఉన్నాయి..? ఏది తింటే బాడీకి ఎన్ని కిలో క్యాలరీలు అందుతాయి..? అధిక కొవ్వులు ఉన్న పదార్థాలేవి..? అసలు ఏమీ ఇబ్బందుల్లేని వంటకాలేవి..? వంటి విషయాలన్నీ చూసుకుంటాడట.  

ఈ విషయం స్వయానా  హార్ధికే చెప్పాడు. ఇటీవలే ఆసియా కప్ లో  కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్   పాండ్యాను.. ‘దుబాయ్ లో ఉన్నావ్ కదా. ఎక్కడైనా తినడానికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తావ్.?’ అని అడిగాడు.

 దానికి పాండ్యా.. ‘అయ్యయ్యో నేను అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి తినను. మా చెఫ్ గారు సదరు ఆహారంలో ఎన్ని క్యాలరీలున్నాయి..? నేను ఎంత తినాలి..? అది నా శరీరానికి మంచిదా.. కాదా.. అని ముందు చెబుతాడు. అలా అయితేనే తింటా..’ అని సెలవిచ్చాడు. 

అదేంటి, మరి టీమిండియా కూడా  ఆటగాళ్లకు పోషకాహారమే ఇస్తుంది కదా..? మరి ఆటగాళ్లంతా  చెఫ్ లను తీసుకెళ్తారా..? అనే డౌటానుమానం రావడంలో అర్థం ఉంది. అయితే ప్రతి జట్టు  తమ ఆటగాళ్లు ఏం తింటే మంచిదనే విషయమై అక్కడి వంటకాలు, వాతావరణ పరిస్థితులను బట్టి  ఆ జట్టుకు ప్రత్యేక న్యూట్రిషనిస్టు కూడా ఉంటాడు. అతడే జట్టు భోజనం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అయితే వీరిలో హార్ధిక్ తన ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహిస్తున్నాడంతే.. 

click me!