నువ్వు టెస్టులు ఆడకు.. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఆడు.. పతిరనకు సీఎస్కే సారథి కీలక సూచన

First Published May 7, 2023, 9:59 PM IST

IPL 2023: ఐపీఎల్-16లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న లంక యువ సంచలనం  మతీశ పతిరన‌కు  చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని  కీలక సూచన చేశాడు. 

Image credit: PTI

గతేడాది  ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి  తన విచిత్రమైన బౌలింగ్  యాక్షన్ తో  వెలుగులోకి వచ్చి ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర  పోషిస్తున్నాడు లంక బౌలర్ మతీశ పతిరన. ఈ శ్రీలంక యువ సంచలనం   ఏడు మ్యాచ్ లు ఆడి  పది వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్-16లో భాగంగా  చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య  శనివారం వాంఖెడే వేదికగా ముగిసిన  మ్యాచ్ లో  పతిరన నెహల్ వధేరా, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్ ల వికెట్లు తీశాడు. మ్యాచ్ ముగిశాక  పతిరనపై ధోని ప్రశంసలు కురిపించాడు. 

Latest Videos


పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో  ధోని మాట్లాడుతూ.. ‘పతిరన బౌలింగ్ ను అర్థం చేసుకోవడం బ్యాటర్లకు కష్టంగానే ఉంటుంది. నిలకడగా బౌలింగ్ చేయడం..  పేస్ అతడిని మరింత   ప్రత్యేకంగా మార్చింది. నా అభిప్రాయం  ప్రకారం అతడు ఇప్పడే   టెస్టు క్రికెట్ జోలికి పోవద్దు.  అసలు అటువైపుగా ఆలోచన చేయకపోవడమే మంచిది.   ఐసీసీ టోర్నీలలో ఆడితేనే బెటర్. 

శ్రీలంక క్రికెట్ కు  అతడు గొప్ప ఆస్తి.   గతేడాది అతడు సీఎస్కే క్యాంప్ లోకి వచ్చినప్పుడు బౌలింగ్ లో అంత పదును లేదు. కానీ ఈ సీజన్ లో అతడు చాలా మెరుగయ్యాడు. అన్నింటికంటే గొప్ప విషయమేమిటంటే అతడింకా యువకుడే. అతడిలో చాలా క్రికెట్ దాగి ఉంది. అయితే అతడు తన ఫిట్నెస్ పై దృష్టి సారిస్తే మంచిది..’అని  చెప్పుకొచ్చాడు.

లంక జట్టు తరఫున  గతేడాది మేలో  అంతర్జాతీయ అరంగేట్రం చేసిన  పతిరన ఇప్పటివరకు  17 మ్యాచ్ లు ఆడాడు. 17 మ్యాచ్ లలో 17 వికెట్లు తీశాడు.  ఇటీవలే లంక జట్టు   కివీస్ తో వన్డే సిరీస్ ఆడగా ఈ జట్టులో పతిరనకు చోటు దక్కినా అతడికి  ఆడే అవకాశం దక్కలేదు.  

కాగా రోహిత్ శర్మతో పాటు ముంబై బ్యాటర్ల వైఫల్యంతో  ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి  139 పరుగులే చేసింది.    నెహల్ వధేరా.. 61 పరుగులతో టాప్ స్కోరర్.  లక్ష్యాన్ని చెన్నై.. 17.4 ఓవర్లలో  4 వికెట్లు మాత్రమే కోల్పోయి  ఛేదించింది.  డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్ (30) రాణించారు. 

click me!