టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ లో ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో 31 కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశ నుంచి భారత్ ను గెలిపించేంతవరకు కోహ్లీ చేసిన పోరాటం క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయాలతో లిఖించదగిందే.
సాక్షాత్తు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యాడు. అతడి నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీ తమకు నేర్పించాడని బాబర్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఈ మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి పీక్స్ లో ఉంటుంది. నేటి మ్యాచ్ లో అది డబుల్ అయింది. కానీ కోహ్లీ మాత్రం ఎక్కడా తడబడలేదు. క్రమం తప్పకుండా నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నా రెచ్చిపోయాడు.
పాండ్యాతో కలిసి కోహ్లీ భారత ఇన్నింగ్స్ ను పునర్నిర్మించాడు. అదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్ లో కోహ్లీ మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ నెమ్మదిగా తన ఫామ్ ను అందుకుని కొరకరాని కొయ్యగా మారాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒత్తిడిని చిత్తు చేస్తూ ఆడిన ఇన్నింగ్స్ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. ఇటువంటి మ్యాచ్ ల ద్వారా వ్యక్తిగతంగా ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది..’ అని బాబర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు.
Image credit: Getty
ఈ మ్యాచ్ లో 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ-పాండ్యాలు సెంచరీ భాగస్వామ్యంతో భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఆఖరి ఓవర్ చివరి బంతి వరకు సాగిన థ్రిల్లర్ లో భారత్.. స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. మహ్మద్ నవాజ్ వేసిన చివరి ఓవర్లో కోహ్లీ ఓ భారీ సిక్సర్ తో పాటు వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 82 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో అతడు 82 పరుగులు చేయడంతో ఈ ఫార్మాట్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ (3,741) ను అధిగమించాడు. రోహిత్.. ఈ ఘనతను 143 మ్యాచ్ లలో అందుకోగా కోహ్లీ.. 110 మ్యాచ్ లలోనే సాధించాడు.