IND vs PAK: అట్లుంటది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ఇది గేమ్ కాదు.. లార్జర్ దెన్ లైఫ్..

First Published | Oct 23, 2022, 6:52 PM IST

ICC T20 World Cup 2022: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో  90 వేలకు పైగా ప్రేక్షకులు.. టీవీలు, మొబైల్ లలో కోటానుకోట్ల మంది క్రికెట్  ప్రేమికులు.. ఎక్కడ చూసినా అదే ఫీవర్. ఓ నాలుగుగంటల పాటు ప్రపంచాన్ని పనులన్నీ పక్కనబెట్టి టీవీల ముందు అతుక్కుపోయే ఎమోషన్. 
 

Image credit: Getty

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎందుకంత క్రేజ్..? మిగతా మ్యాచ్ ల మాదిరిగానే అది కూడా ఓ నలభై ఓవర్ల ఆటే కదా.  ఈ మ్యాచ్ కు ఐసీసీ ఏమైనా ప్రత్యేక మినహాయింపులిస్తుందా..?  వేరే లోకం నుంచి  ఆటగాళ్లు వచ్చి  ఇరు దేశాల తరఫున ఆడతారా...? బంతి, బ్యాట్, వికెట్లు కాకుండా మరేదైనా కొత్త పరికరాలతో ఆడతారా..?  అన్ని మ్యాచ్‌ల మాదిరిగానే ఇది కూడా జస్ట్ ఓ గేమ్ మాత్రమే కదా..? కాదు. అస్సలు కాదు.

India vs Pakistan

మనిషికి సంతోషం, దుఖం, కోపం, బాధ వంటి ఎమోషన్స్ ఎలాగో.. భారత్-పాక్ క్రికెట్ అభిమానుల్లో  ఇరు దేశాల మధ్య మ్యాచ్ కూడా అటువంటి ఒక ఎమోషన్. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఇది మిగతా జట్లతో ఆడే ఒక మ్యాచ్ వంటిది కానే కాదు.. రెండు దేశాల అభిమానులకు ‘లార్జర్ దెన్ లైఫ్’ వంటి  మూవ్‌మెంట్.  హాలీవుడ్  థ్రిల్లర్ లు,  ఓటీటీలలో సీజన్ల కొద్దీ  సస్పెన్స్ సినిమాలు, ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినిమాలు చూస్తే ఎంత మజా వస్తుందో తెలీదు గానీ.. భారత్ -పాక్ మ్యాచ్  చూస్తే అంతకు కొన్ని వేల రెట్ల మజా  వస్తుంది. 


అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దానిని మరోసారి ప్రూవ్ చేసింది. ఇవాళ భారత్-పాక్ మధ్య ఎంసీజీ వేదికగా ముగిసిన మ్యాచ్ లో భారత్  4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో విజేత, పరాజిత విషయం పక్కనబెడితే ఈ గేమ్ ఇచ్చిన  మజా మాత్రం మరోసారి భారత్.. పాక్ మధ్య  మ్యాచ్ జరిగేంతవరకూ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. 

పాకిస్తాన్ ఓపెనర్లు త్వరగా నిష్క్రమించినా  ఆ జట్టు మిడిలార్డర్లు ఆదుకుని పాక్ ను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ లు నింపాదిగా ఆడి పాక్ కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. కొద్దిగా చూసి ఆడి వికెట్లను కాపాడుకుంటే ఇక్కడ బాదడం పెద్ద విషయం కాదని ప్రూవ్ చేశారు. 
 

సుమారు 170 కోట్ల మంది (ఇండియా, పాకిస్తాన్) ప్రజల భావోద్వేగాలు ఈ మ్యాచ్ లో ఇమిడి ఉంటాయి. ఒత్తిడిని చిత్తు చేసిన వాడే విజేత.  ఓరోజు హీరో మరోరోజు జీరో అవుతాడు. గతేడాది పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ను షాహీన్ షా అఫ్రిది కకావికలం చేశాడు.  ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ లు వికెట్ నష్టపోకుండా  లక్ష్యాన్ని ఛేదించారు.  కానీ  నేటి మ్యాచ్ లో ఆ ముగ్గురూ తమ మార్కు చూపలేకపోయారు.  బాబర్, రిజ్వాన్ అయితే అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. 

పాకిస్తాన్ ఇన్నింగ్స్ మాదిరే భారత్ కూడా గొప్ప ఆరంభమేమీ చేయలేదు. రెండో ఓవర్లోనే రాహుల్ ఔట్. తర్వాత రోహిత్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం కామ్ గా ఉన్నాడు.ఆ సమయంలో మరో వికెట్ పడితే ఎలా ఉండేదో గానీ కోహ్లీ.. పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ ను పునర్ నిర్మించాడు.  తనను ఎందుకు ఛేదనలో మొనగాడు అంటారో మరోసారి నిరూపించాడు. 

160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత స్కోరు పది ఓవర్లకు 45 పరుగులే. చివరి 10 ఓవర్లలో కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో కోహ్లీ-పాండ్యాలు ఒత్తిడిని చిత్తు చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి  వందకు పైగా భాగస్వామ్యాన్ని జోడించారు.  

Image credit: Getty

ఆటలో అన్నింటికంటే కీలకం చివరి 3 ఓవర్లు. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన క్రమంలో కోహ్లీ జూలు విదిల్చాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టాడు. హరీస్ రౌఫ్ వేసిన తర్వాత ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు.  మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ కూడా ఇదే. 

ఇక చివరి ఓవర్ లో కావాల్సినంత డ్రామా ఉంది. భారత విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన క్రమంలో బాబర్ ఆజమ్ మహ్మద్ నవాజ్ కు బంతినిచ్చాడు. తొలి బంతికి హార్ధిక్ ఔట్. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి రెండు పరుగులు. నాలుగో బంతి కి సిక్సర్. కానీ అది నోబాల్.  తర్వాత బంతికి బైస్ రూపంలో 3 పరుగులొచ్చాయి. నాలుగో బంతికి  కార్తీక్ స్టంప్ అవుట్. ఉత్కంఠ ఇంకా పెరిగింది.  రెండు బంతుల్లో 3 పరుగులు చేయాలి.  ఐదో బంతిని నవాజ్ వైడ్ గా విసిరాడు.  స్కోర్లు లెవల్. చివరి బంతికి అశ్విన్ మిడాఫ్ దిశగా షాట్ ఆడి సింగిల్ తీశాడు.. 

virat kohli

అశ్విన్  కొట్టిన  బంతి మిడాఫ్ మీదుగా ఎగురగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానులు, టీమిండియా ఆటగాళ్లు, టీవీల ముందు   చూస్తున్న కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినా  తక్కువ స్కోరును కాపాడుకోవడంలో పాకిస్తాన్ చేసిన పోరాటం  తక్కువ చేయనిది. 

Image credit: Getty

ఆసియా కప్-2022 లో  సూపర్ - 4లో పాకిస్తాన్ చేతిలో ఓడిన తర్వాత (ఇంకా చెప్పాలంటే గతేడాది దుబాయ్ లో ప్రపంచకప్ లో ఓడినప్పట్నుంచి చెప్పినా తక్కువే) ప్రతీ భారత క్రికెట్ అభిమానులు  మెల్‌బోర్న్‌లో మ్యాచ్ ఎప్పుడా..? అని కండ్లు కాయాలు కాసేలా వేచి చూస్తూనే ఉన్నారు. అలాంటి వారికి మాత్రం ఈ మ్యాచ్ షడ్రుచులతో కూడిన విందు భోజనం వంటిదే. 
 

Latest Videos

click me!