అతడి వల్ల నిద్రలేని రాత్రులు గడిపా.. చాలా భయపెట్టాడు.. : డుప్లెసిస్

First Published Jan 15, 2023, 2:23 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప రికార్డు ఉన్నా   డుప్లెసిస్ భారత్ లో ఆడిన  ఏడు టెస్టులలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.    ఉపఖండంలో అతడి  బ్యాటింగ్ సగటు  20 కూడా దాటలేదు.  భారత్ లో కూడా...

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన  ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పక్కకు జరిగాక  ఫ్రాంచైజీ క్రికెట్ కే ప్రాధాన్యమిస్తున్నాడు.    ఐపీఎల్, సీపీఎల్, బీపీఎల్, పీఎస్ఎల్ ఇలా.. ఎక్కడ లీగ్ జరిగినా  డుప్లెసిస్ వెళ్లాల్సిందే.    ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఎ20 లో కూడా  అతడు జోబర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్ వాళ్లది)  కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 
 

అయితే తాను  అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పుడు  ప్రపంచ దిగ్గజ బౌలర్లెందరినో గజగజలాడించిన డుప్లెసిస్ ను కూడా పలువురు బౌలర్లు భయపెట్టారట. మరీ ముఖ్యంగా ఉపఖండపు పిచ్ లపై అయితే  తనను   రవీంద్ర జడేజా ఇబ్బందిపెట్టినంతగా మరెవరూ పెట్టలేదని అన్నాడు.  అతడి వల్ల తాను నిద్ర లేని రాత్రులను కూడా గడిపానని చెప్పాడు. 

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘మిగతా దేశాలతో పోలిస్తే ఉపఖండపు పిచ్ లు  చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం కఠిన సవాల్ తో కూడుకున్నది.  పాకిస్తాన్ స్పిన్నర్ సయూద్ అజ్మల్ బౌలింగ్  తో కాస్త ఇబ్బందిపడేవాడిని.  

ఇక భారత్ లో అయితే రవీంద్ర జడేజా. అతడి బౌలింగ్ ను ఎదుర్కోవడానికి   చాలా  కష్టపడ్డా.  స్పిన్ కు అనుకూలించే పిచ్ పై అతడిని ఎదుర్కోవడమంటే అది పులికి ఎదురెళ్లడం వంటిదే. జడేజా వల్ల  నేను నిద్రలేని రాత్రులను గడిపాను..’అని చెప్పాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప రికార్డు ఉన్నా   డుప్లెసిస్ భారత్ లో ఆడిన  ఏడు టెస్టులలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.    ఉపఖండంలో అతడి  బ్యాటింగ్ సగటు  20 కూడా దాటలేదు.  భారత్ లో  ఏడు  టెస్టులు ఆడిన డుప్లెసిస్.. 15.6 సగటుతో 202 పరుగులు మాత్రమే చేశాడు.   అత్యధిక స్కోరు 64 పరుగులు. భారత్ తో పాటు పాకిస్తాన్ లో కూడా డుప్లెసిస్  విఫలమయ్యాడు.  

ఇదిలాఉండగా  డుప్లెసిస్, జడేజా లు కలిసి  ఐపీఎల్ లో చాలాకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున  ఆడారు. ఈ ఇద్దరూ చెన్నై విజయాల్లో కీలక భూమిక పోషించారు.  అయితే  2022 వేలంలో  డుప్లెసిస్.. ఆర్సీబీకి మారగా జడేజా చెన్నైతోనే ఉన్నాడు. 

click me!