హార్ధిక్ వద్ద ఏం ప్లాన్స్ లేవు.. కెప్టెన్‌గా అతడు ఫెయిల్ : పాక్ మాజీ స్పిన్నర్ కామెంట్స్

First Published Jan 29, 2023, 4:20 PM IST

INDvsNZ: స్వదేశంలో  శ్రీలంకతో  టీ20 సిరీస్ లో భారత్ ను  నడిపించడంలో సఫలమైన  టీమిండియా తాత్కాలిక సారథి  హార్ధిక్ పాండ్యా.. కివీస్ తో  తొలి టీ20లో మాత్రం  దారుణంగా విఫలమయ్యాడు. 

న్యూజిలాండ్ తో  వన్డే సిరీస్ గెలిచిన  ఊపులో ఉన్న టీమిండియా.. టీ20 సిరీస్ లో భాగంగా  ఇటీవలే రాంచీలో ముగిసిన   మొదటి టీ20లో మాత్రం ఆ జోష్ ను చూపించలేకపోయింది.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా దారుణంగా విఫలమైంది. టీమ్ ను విజయవంతంగా నడిపించడంలో  పాండ్యా కూడా  ఫెయిల్ అయ్యాడు.   బౌలర్ గా విఫలమైన పాండ్యా.. బ్యాటర్ గా  కూడా ఆకట్టుకోలేదు.

ఈ మ్యాచ్ లో పాండ్యా  వ్యవహరించిన తీరు, మ్యాచ్   ప్రణాళికలు కూడా  విమర్శలకు తావిచ్చాయి.  తానే తొలి ఓవర్ వేయడం,  పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా   పేసర్లకు బంతినిచ్చి  కివీస్ భారీ పరుగులు చేసేలా అవకాశాలు కల్పించడం,  టీ20లో మంచి రికార్డు ఉన్న పృథ్వీ షాను కాదని అంత గొప్ప రికార్డు లేని గిల్ ను ఆడించడం వంటివి   విమర్శలకు దారితీశాయి.
 

తాజాగా ఇదే విషయమై  పాకిస్తాన్  మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా  స్పందించాడు.  రాంచీ టీ20లో  హార్ధిక్ అన్ని రంగాల్లో విఫలమయ్యాడని, అసలు అతడు ప్రణాళికలతో బరిలోకి దిగలేదని అర్థమవుతుందని  వ్యాఖ్యానించాడు.   తన బౌలర్లను సమర్థవంతంగా వాడుకోవడంలో పాండ్యా దారుణంగా ఫెయిల్ అయ్యాడని  చెప్పాడు.

తన యూట్యూబ్ ఛానెల్ లో కనేరియా  మాట్లాడుతూ... ‘రాంచీ మ్యాచ్ లో  హార్ధిక్ పాండ్యా  తన బౌలర్లను రొటేట్  చేయడంలో తెలివిగా వ్యవహరించలేదు.  శివమ్ మావిని ఆలస్యంగా  తీసుకొచ్చాడు.  అతడిని ముందే దించాల్సింది. అంతేగాక  స్పిన్నర్ దీపక్ హుడాతో  కూడా మరిన్ని ఓవర్లు వేయిస్తే బాగుండేది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినప్పుడు  పేసర్లకు బంతినివ్వడం సరైంది కాదు.

ఇక్కడే పాండ్యా వ్యూహాలు లోపించాయి.  మ్యాచ్ చూస్తే అసలు అతడి దగ్గర ప్రణాళికలు ఉన్నాయా అని అనిపించింది..  భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు.  హార్ధిక్ కూడా చెత్తగా బౌలింగ్ చేశాడు.  3 ఓవర్లలో 33 పరుగులిచ్చాడు...’అని  తెలిపాడు.

కాగా రాంచీలో  ఓడిన టీమిండియా నేడు లక్నో వేదికగా జరుగబోయే రెండో టీ20లో కివీస్ తో తలపడనుంది. సిరీస్  మీద ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్.. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది.  తొలి మ్యాచ్ లో  వైఫల్యాల నేపథ్యంలో లక్నో టీ20లో పలు మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.   గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్ లపై వేటు పడొచ్చు. గిల్ స్థానంలో పృథ్వీ షా ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

click me!