అతడు టీమిండియా డివిలియర్స్.. ఆసీస్‌లో అదరగొట్టడం ఖాయం: మిస్టర్ 360పై సఫారీ దిగ్గజ పేసర్ ప్రశంసలు

First Published Oct 13, 2022, 12:16 PM IST

Suryakumar Yadav: తన కెరీర్ లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న భారత జట్టు మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు. 

గత దశాబ్దంలో క్రికెట్ ప్రపంచాన్ని తన విలక్షణమైన బ్యాటింగ్, అబ్బురపరిచే షాట్లతో అలరించిన  దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గతేడాది (2021) ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  అతడి స్థానంలో సఫారీ జట్టులోకి డెవాల్డ్ బ్రెవిస్ చేరాడు. అతడిని జూనియర్ ఏబీడీ అని పిలుస్తున్నారు. 

కానీ భారత జట్టులో కూడా ఓ డివిలియర్స్ ఉన్నాడంటున్నాడు దక్షిణాణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.  గత ఏడాది కాలంగా టీ20లో అత్యద్భుత ఫామ్ లో ఉండి  తనకు మాత్రమే సొంతమైన షాట్లతో అలరిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ఇండియా డివిలియర్స్ అని  ప్రశంసలు కురిపించాడు. 

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో  స్టెయిన్  ఓ టీవీ చర్చలో  మాట్లాడుతూ.. ‘సూర్యకుమార్  అద్భుతమైన 360 డిగ్రీస్ ప్లేయర్. అతడిని చూస్తుంటే నాకు  ఏబీ డివిలియర్స్ గుర్తుకొస్తున్నాడు. సూర్య టీమిండియా డివిలియర్స్ అనడంలో సందేహమే లేదు. రాబోయే ప్రపంచకప్ లో అతడి ఆట తప్పకుండా చూడాలి. 

ఆస్ట్రేలియా లో పిచ్ లు పేస్, బౌన్స్ తో పాటు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి. పేస్ ను ఉపయోగించుకుంటూ పరుగులు రాబట్టడంలో సూర్య ఆరితేరాడు.  ప్రపంచకప్ జరిగే పెర్త్, మెల్బోర్న్, సిడ్నీ గ్రౌండ్ లలో ఎక్స్ ట్రా  పేస్ ఉంటుంది.

ఆ పేస్ ను వాడుకుని పరుగులు రాబట్టొచ్చు. బ్యాక్ ఫుట్, ఫైన్ లెగ్ దిశగా మంచి షాట్లు ఆడొచ్చు. ఇప్పటికే సూర్య ఆ షాట్లు ఆడటంతో ప్రావీణ్యం  సంపాదించాడు..’ అని తెలిపాడు. 

ఏడాది  కాలంగా టీ20లలో భారత్ తరఫున  పరుగుల సునామీ సృష్టిస్తున్న సూర్య.. ఇటీవల ముగిసిన ఆసియా కప్ తో పాటుగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో మెరుపులు మెరిపించాడు.  ఒకరంగా భారత జట్టు ఈ రెండు సిరీస్ లు నెగ్గడానికి సూర్య బ్యాటింగ్ విన్యాసాలు కూడా ఓ కారణం.  

ఈ సిరీస్ లతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. రెండ్రోజుల క్రితం వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.ఆ మ్యాచ్ లో రోహిత్, పంత్, పాండ్యా వంటి  ఆటగాళ్లు విఫలమైనా  సూర్య మాత్రం హాఫ్  సెంచరీతో చెలరేగాడు. ఈ  ఫామ్ ను ప్రపంచకప్ లో కూడా కొనసాగించాలని టీమిండియా ఆశిస్తున్నది. 

click me!