నా జట్టు నా ఇష్టం.. శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకోకపోవడంపై హార్ధిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్

First Published Nov 23, 2022, 1:27 PM IST

కుర్రాళ్లకు అవకాశమివ్వకపోవడంలో తాను కూడా  రోహిత్ శర్మ మాదిరే అన్నట్టుగా  వ్యవహరిస్తూ   హార్ధిక్ పాండ్యా.. న్యూజిలాండ్ తో సిరీస్ లో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లను పక్కనబెట్టాడు. దీంతో  వాళ్లిద్దరికీ అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పదే పదే విఫలమవుతున్నా  రిషభ్ పంత్ కు అవకాశాలివ్వడం,   వచ్చే ప్రపంచకప్ లో ఆడతాడో లేదో తెలియని భువనేశ్వర్ ను ఆడించడం, రాణించకున్నా పలువురిని జట్టులో భారంగా కొనసాగించడం వంటివి టీమిండియాను పట్టిపీడిస్తున్నాయి.  మరీ ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ కు జట్టులో చోటివ్వకపోవడం  తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. 

వచ్చే 2024 టీ20 ప్రపంచకప్ కు జట్టును తయారుచేసుకునేందుకు గాను ఇప్పట్నుంచే  ప్రయత్నాలు మొదలుపెట్టిన టీమిండియా  అందుకు తగిన విధంగా సన్నాహకాలు చేయడం లేదని  ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.  టీ20లలో మెరుగైన రికార్డు లేని పంత్ ను కొనసాగించడం,  ప్రతిభ ఉన్నా శాంసన్ ను పక్కనబెడుతుండటం, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు అవకాశాలివ్వకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంలో పాండ్యా కూడా రోహిత్ మాదిరే వ్యవహరిస్తున్నాడని వాపోతున్నారు. 

అయితే కివీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత హార్ధిక్ పాండ్యా ఈ విషయమై నోరు విప్పాడు. బయట చాలా మంది చాలా మాట్లాడుతున్నారని వాటిని తాము పట్టించుకోమని, ఎవరిని ఆడించాలో, ఎవరిని పక్కనెట్టాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించాడు. 

న్యూజిలాండ్ తో ముగిసిన మూడో టీ20 మ్యాచ్ అనంతరం  పాండ్యా మాట్లాడుతూ.. ‘ముందుగా మీకు ఒక విషయం  స్పష్టం చేయాలనుకున్నా.  బయట చాలా మంది జట్టు గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్లు ఏం మాట్లాడినా  ఆ మాటలు మా పై ఎలాంటి ప్రభావమూ చూపించవు. 

ఇది నా జట్టు. హెడ్ కోచ్ తో చర్చించిన తర్వాతే  ఎవరు తుది జట్టులో ఉండాలి అనేది నిర్ణయించుకుంటాం. ఆ విధంగా ప్రణాళికలు, జట్టు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం.  ప్రతీ ఒక్కరికీ  ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తుంది.  ఈ సిరీస్ లో ఆడని వారికి భవిష్యత్ లో మరో సిరీస్ ఆడే ఛాన్స్ ఉంటుంది. 

మేం ఇంకా ఆడాల్సిన కీలక సిరీస్ లు చాలా ఉన్నాయి.  న్యూజిలాండ్ టూర్ లో మాకు మరికొన్ని మ్యాచ్ లు ఉంటే మిగతా ఆటగాళ్లతో ప్రయోగాలు చేద్దామని అనుకున్నాం. కానీ  అది కుదరలేదు..’ అని  పాండ్యా తెలిపాడు. 
 

Image credit: Getty

ఇక న్యూజిలాండ్ తో  మంగళవారం నేపియర్ వేదికగా ముగిసిన మ్యాచ్ వర్షం కారణంగా  టైగా ముగిసింది.   ఈ సిరీస్ లో  తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్  161 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎదుట నిలిపింది.  

Image credit: Getty

 లక్ష్య ఛేదనలో  భారత్ 9 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి  75 పరుగులు చేసింది.  డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం  వర్షం పడేటప్పటికీ  చేయాల్సిన స్కోరుకు భారత స్కోరు సమానంగా ఉండటంతో  మ్యాచ్ టై గా ముగిసింది. ఫలితంగా భారత్ సిరీస్ ను 1-0తో చేజిక్కించుకుంది. 

click me!