Harshal Patel: ఐపీఎల్ వేలానికి ముందే మొదలైన అసలు ఆట మొదలైంది. ఐపీఎల్ 2027 ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను రూ. 4 కోట్ల ఆల్ క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులకు మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. రెండుసార్లు ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ తన జట్టును మారబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి హర్షల్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్ (GT) ఆల్ క్యాష్ ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుంది. నవంబర్ 17న రిటెన్షన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ కీలక డీల్ కుదిరింది.
25
రూ. 4 కోట్ల ఆల్ క్యాష్ ట్రేడ్ వివరాలు
2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు అందులో సగం ధరకు, అంటే రూ. 4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ అతడిని దక్కించుకుంది. ఈ ట్రేడ్ పూర్తయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆక్షన్ పర్స్ నుంచి రూ. 4 కోట్లు తగ్గుతాయి. 2012లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్‌కు ఇది ఐదవ ఫ్రాంచైజీ కానుంది. గతంలో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడాడు.
35
సొంత గడ్డపైకి హర్షల్ పటేల్
ఈ నెల చివర్లో 36వ ఏట అడుగుపెట్టనున్న హర్షల్ పటేల్‌కు ఇది ఒక రకంగా హోమ్‌కమింగ్ లాంటిది. అహ్మదాబాద్‌లో జన్మించిన హర్షల్, కొన్ని ఏళ్ల క్రితం దేశవాళీ క్రికెట్ ఆడేందుకు గుజరాత్‌కు మారాడు. ఇప్పుడు సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ తరపున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. గుజరాత్ పేస్ దళంలో ఇప్పటికే కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరికి హర్షల్ పటేల్ అనుభవం, డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో బాల్స్ వేసే నైపుణ్యం అదనపు బలం కానుంది.
హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ గతంలోనే చాలాసార్లు గట్టిగా ప్రయత్నించింది. 2024 వేలంలో హర్షల్ కోసం జీటీ రూ. 10.5 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 11.75 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఆ తర్వాత 2025 మెగా వేలంలోనూ గుజరాత్ రూ. 6.5 కోట్ల వరకు పోటీ పడి తప్పుకుంది. ఎట్టకేలకు ఇప్పుడు ట్రేడ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
55
సన్‌రైజర్స్‌లో తగ్గిన అవకాశాలు.. బౌలింగ్ విభాగంలో మార్పులు
2021లో ఆర్సీబీ తరపున 32 వికెట్లు, 2024లో పంజాబ్ తరపున 24 వికెట్లు తీసి హర్షల్ పటేల్ రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. 2025లో సన్‌రైజర్స్ తరపున 13 మ్యాచ్‌లలో 9.80 ఎకానమీతో 16 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. కానీ ఐపీఎల్ 2026లో అన్‌క్యాప్డ్ భారత పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లకు సన్‌రైజర్స్ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. దీంతో హర్షల్ కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడి, ఒక్క వికెట్ కూడా తీయకుండా 10.82 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.
మరోవైపు రాబోయే సీజన్ కోసం సన్‌రైజర్స్ తమ పేస్ విభాగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టి. నటరాజన్‌ను, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను ట్రేడ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఐపీఎల్ ట్రేడింగ్ విండో డిసెంబర్ 9 వరకు తెరిచి ఉండగా, డిసెంబర్ 16న వేలం జరగనుంది.