IPL 2022: ఒకప్పుడు తగ్గేదేలే.. ఇప్పుడు మాత్రం తగ్గాల్సిందే.. ఈ నలుగురు స్టార్ల జీతాల్లో భారీ కోత

First Published Dec 2, 2021, 12:02 PM IST

IPL Retention: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు  అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఇప్పుడు తక్కువకే డీల్ కుదుర్చుకున్నారు. వచ్చే సీజన్ లో నలుగురు ఆటగాళ్లు జీతాన్ని తగ్గించుకుని మరీ పాత ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. 

ఐపీఎల్ ను అందరూ క్యాష్ రిచ్ లీగ్ అంటారు. రెండు నెలల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి రెండు కొత్త జట్లు వచ్చినప్పుడు.. వేలంలో లక్నో, అహ్మదాబాద్ ను దక్కించుకున్నప్పుడు వాటికోసం అవి  పెట్టిన పెట్టుబడులు చూశాక ఐపీఎల్ ఎందుకు క్యాష్ రిచ్ లీగ్ అయిందో అందరికీ అర్థమైంది.

అయితే భారీగా సంపద పోగవుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్లకు కూడా వాళ్లు ఊహించని రేటు పలుకుతుంది.  నాలుగైదు మ్యాచుల్లో ప్రదర్శన బాగుండి కొంచెం ప్రతిభ ఉన్నా చాలు.. వాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. 

అయితే ఇదే సమయంలో ఎంతో అనుభవం ఉండీ.. మ్యాచ్ విన్నర్లుగా పేరున్న పలువురు ఆటగాళ్లు మాత్రం అనూహ్యంగా గతంలో పొందినదానికంటే తక్కువకే ఐపీఎల్ లో కంటిన్యూ అవుతున్నారు. 

ఈసారి అలాంటి ప్లేయర్లు నలుగురు (రిటెన్షన్ జాబితా వచ్చినమేరకే.. ఇంకా వేలం జరుగులేదు) ఉన్నారు. వారిలో ఇద్దరు టీమిండియా కెప్టెన్లే కావడం గమనార్హం. 

మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి.. ఐపీఎల్ లో వీళ్లు ఆడకున్నా సరే.. కనీసం డగౌట్ లో కూర్చున్నా కోట్లకు కోట్లు ముట్టజెప్పే ఫ్రాంచైజీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ ధరకే తమ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

సుదీర్ఘకాలంగా ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు స్టార్లు.. గతంతో పోలిస్తే తక్కువ రేటుకే జట్లతో కొనసాగడానికి ఒప్పందాలు చేసుకున్నారు. 

భారత  వన్డే, టెస్టు సారథి విరాట్ కోహ్లికి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విడదీయరాని అనుబంధముంది. మొన్నటివరకు ఆర్సీబీలో అతడి వేతనం ఏడాదికి రూ. 17 కోట్లు. కానీ వచ్చే సీజన్ కోసం అతడు ఆర్సీబీతో కొనసాగడానికి రూ. 2 కోట్లు తగ్గించుకున్నాడు.

ఐపీఎల్ హయ్యెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్న విరాట్ కోహ్లీ (6,283).. చాలా కాలంగా తాను ఆడుతున్న ఫ్రాంచైజీ కోసం రెండు కోట్లు తగ్గించుకుని మరీ  అదే జట్టుతో కొనసాగుతున్నాడు.

ఇక మహేంద్రుడికి.. తమిళ తంబీలది వేరే ఎమోషన్.. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో కొనసాగుతున్న ధోని కూడా వేతనాన్ని తగ్గించుకున్నాడు. గతంలో ధోనికి రూ. 15 కోట్లు చెల్లించిన సీఎస్కే.. ఇప్పుడు రూ. 12 కోట్లు మాత్రమే ఇస్తున్నది. 

ధోని, కోహ్లీతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న  సునీల్ నరైన్  వేతనం కూడా తగ్గింది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణిస్తున్న ఈ కేకేఆర్ ఆటగాడి వేతనం గతంలో రూ. 12.5 కోట్లు కాగా తాజాగా  అది సగానికి తగ్గింది. వచ్చే సీజన్ కోసం నరైన్ ను రూ. 6 కోట్లు ఇచ్చి నిలుపుకుంది కేకేఆర్. 

ఇక మరో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా విధ్వంసక వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా తక్కువ వేతనానికే  ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో రూ  14.25 కోట్లకు మ్యాక్సీని ఆర్సీబీ దక్కించుకోగా.. తాజాగా అతడు రూ. 11 కోట్లకే  రిటైన్ చేసుకున్నది. 

click me!