పన్నులు కడుతున్నాం కదా.. ఎందుకివ్వరు..? జార్ఖండ్ ప్రభుత్వంపై ధోని భార్య ఆగ్రహం

First Published Apr 26, 2022, 3:43 PM IST

Sakshi Dhoni: టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ జార్ఖండ్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించింది.  బాధ్యత గల పౌరులుగా తాము పన్నులు కడుతున్నా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఫైర్ అయింది. 

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య  సాక్షి సింగ్ ధోని జార్ఖండ్ ప్రభుత్వంపై  విమర్శలు  సంధించింది. కొన్నాళ్లుగా అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న విద్యుత్ సమస్యపై ట్విటర్ వేదికగా  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

బాధ్యత గల పౌరులుగా తాము  విధిగా పన్నులు చెల్లిస్తున్నా.. విద్యుత్ ను ఆదా చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకున్నాయని నిలదీసింది. 

Latest Videos


ట్విటర్ వేదికగా  స్పందించిన  సాక్షి.. ‘జార్ఖండ్ లో విధిగా పన్నులు చెల్లిస్తున్న వ్యక్తిగా  రాష్ట్ర ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకున్నాయి..?  ఆ విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 

బాధ్యత కలిగిన పౌరులుగా మా తరఫున మేము విద్యుత్ ను ఆదా చేస్తున్నాం. అయినా కూడా రాష్ట్రంలో సమస్య కొలిక్కి రావడం లేదు..’  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

గత కొన్ని రోజులుగా జార్ఖండ్ లో రోజూవారీ ఉష్ణోగ్రతలో 40 డిగ్రీలు దాటుతున్నాయి. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల లోడ్ మార్పు పేరుతో విద్యుత్ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు.

దీంతో ఇప్పటికే చుట్టూ గనులు, కోల్ మైన్స్ తో ఉండే జార్ఖండ్ లో ప్రజలు ఉక్కపోతలతో  అల్లాడుతున్నారు. ఇదే విషయాన్ని సాక్షి ధోని తన ట్వీట్ లో ఎత్తిచూపింది.

ఇదిలాఉండగా.. రాష్ట్రంలో పవర్ ప్లాంట్లకు  బొగ్గు నిల్వలు సరిగా లేనందువల్లే విద్యుత్ కోతలు  విధిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గిర్ది, ఈస్ట్ సింగ్బూబ్,వెస్ట్ సింగ్బూమ్, రాంచీ, బొకారో, కొడర్మ, పలాము, గర్హ్వ, చత్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.  

click me!