Ross Taylor: కివీస్ క్రికెట్‌లో బయిటకు కనిపించేదొకటి.. లోపల మరొకటి.. రాస్ టేలర్ షాకింగ్ కామెంట్స్

First Published Aug 11, 2022, 5:29 PM IST

Ross Taylor Auto biography: క్రికెట్ లో న్యూజిలాండ్ జట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే పైకి కనిపించేదంతా బంగారం కాదంటున్నాడు కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్. ఆ మేడిపండును విప్పి చూస్తే  లోపల ఉన్న పురుగుల సంగతి బయటపడుతుందని సంచలన కామెంట్స్ చేశాడు. 

న్యూజిలాండ్ క్రికెట్ అంటే అందరూ  అది ‘స్వచ్ఛమైన జట్టు’ అని  భావిస్తారు. ఇతర జట్ల మాదిరిగా వివాదాలు,   విభేదాలు,  తగాదాలు,  తలవంపులు తెచ్చిపెట్టిన ఘటనలు ఆ జట్టుకు చాలా తక్కువ. అసలు లేవని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ‘ప్రొఫెషనల్ క్రికెట్ ఆడతారు.. ప్రొఫెషనల్స్ గా వ్యవహరిస్తారు’ అని కివీస్ క్రికెటర్లకు మంచి పేరుంది. 

అయితే పైకి కనిపించేదంతా బంగారం కాదంటున్నాడు కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్. ఆ మేడిపండును విప్పి చూస్తే  లోపల ఉన్న పురుగుల సంగతి బయటపడుతుందని అంటున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ లో వివక్ష సర్వ సాధారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.  అందుకు తానే బాధితుడినని.. స్వయంగా రేసిజానికి గురయ్యానని  వ్యాఖ్యానించాడు. 

తాజాగా  టేలర్ తన ఆత్మకథలో న్యూజిలాండ్  క్రికెట్ పై సంచలన ఆరోపణలు చేశాడు.  టేలర్ స్పందిస్తూ.. ‘న్యూజిలాండ్ లో  నా 16 ఏండ్ల క్రికెట్ కెరీర్ సక్రమంగా సాగిందని మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ  అది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు మరోలా ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే వివక్ష బయట ప్రపంచానికి తెలియదు. తెలియనివ్వరు.. 

మిగతావాళ్ల సంగతి ఎందుకు.. స్వయంగా నేనే దానికి బాధితుడిని. నా సొంత జట్టుకు చెందిన పలువురు క్రికెటర్లు నా మొహం గురించి కామెంట్స్ చేసేవాళ్లు. నీలో ఆసియా మూలాలున్నాయని, పొరపాటను నేను న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నానని  మాట్లాడేవాళ్లు.. 

రాస్ నువ్వు సగం మాత్రమే మంచోడివి.  మిగతా సగం ఏంటనేది నువ్వే  తేల్చుకో అనేవాళ్లు. అయితే ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం.  దానిని దాటి  గ్రౌండ్ లోకి అడుగుపెట్టామంటే మా దృష్టంతా జట్టు విజయంమీదే ఉంటుంది. కానీ తెరవెనుక జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంతోనే నేను మా డ్రెస్సింగ్ రూమ్ ను ఒక బారోమీటర్ గా నేను అభివర్ణిస్తాను. 

నాకు సంబంధించినంతవరకు నామీద చేసిన కామెంట్లను నేను మొదట్లో అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తర్వాత కూడా పదే పదే అవే కామెంట్లు చేసేవాళ్లు. దాంతో నేను వివక్షకు గురవుతున్నానని బాధగా ఉండేది..’ అని కామెంట్స్ చేశాడు టేలర్. మరి దీనిపై బ్లాక్ క్యాప్స్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. 

click me!