స్వీట్లు తినడం మానేశాను, 7 కిలోల బరువు తగ్గాను... అయినా టీమిండియాకి ఆడడానికి సరిపోనా..

First Published Oct 8, 2022, 2:14 PM IST

ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో చెలరేగి అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించాడు యంగ్ సెన్సేషనల్ పృథ్వీ షా. 2018 అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా భారత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా, 2020 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ టెస్టు తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు...

Prithvi Shaw

ఆడిలైడ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన పృథ్వీ షా.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36/9 స్కోరుకే పరిమితమై దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫెయిల్యూర్‌తో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో పృథ్వీ షా, వృద్ధిమాన్ సాహాలపై వేటు వేసింది భారత జట్టు...

అలా టీమిండియాకి దూరమైన పృథ్వీ షా... గబ్బాలో జరిగిన టెస్టు మ్యాచ్‌కి ముందు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, కెఎల్ రాహుల్.. ఇలా అరడజనుకి పైగా ప్లేయర్లు గాయపడినా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మయాంక్ అగర్వాల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించిన టీమిండియా, యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌ని రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించింది. గిల్ సక్సెస్, పృథ్వీ షాని టీమిండియాలోకి రాకుండా గేట్లు మూసేసినట్టైంది...

టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన పృథ్వీ షా, వన్డే టీమ్‌లో అయనా ప్లేస్ దక్కుతుందని భావించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో పృథ్వీ షా పేరు కనిపించలేదు. దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా పృథ్వీ షాని పట్టించుకోలేదు సెలక్టర్లు...

‘నేను చాలా నిరుత్సాహపడ్డాను. నేను బాగా పరుగులు చేస్తున్నా. ఎంతో కష్టపడుతున్నా కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే నేను దీన్ని ఇక్కడితో వదిలేయను. సెలక్టర్లు, నేను ఎప్పుడు టీమిండియాకి ఆడడానికి సిద్ధంగా ఉన్నానని భావిస్తారో, అప్పుడే ఆడనివ్వని... 

అప్పటిదాకా నేను ఎదురుచూస్తూనే ఉంటా. నేను ఇప్పటికే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను. నా బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు, అయితే ఫిట్‌నెస్ లేదని నన్ను పక్కనబెడుతున్నారు. అందుకే బరువు తగ్గడంపై పూర్తి ఫోకస్ పెట్టాను. ఐపీఎల్ 2022 తర్వాత ఏడు నుంచి 8 కిలోల వరకూ బరువు తగ్గాను...

జిమ్‌లో చాలా సమయం గడుపుతున్నాను. రన్నింగ్ చేస్తున్నా. నాకెంతో ఇష్టమైన స్వీట్స్ తినడం కూడా మానేశాను. కూల్ డ్రింక్స్ కూడా తాగడం లేదు. చైనీస్ ఫుడ్‌ని కూడా నా మెనూ నుంచి తీసేశాను...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో నా పర్ఫామెన్స్, టీమ్‌కి సెలక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు 22 ఏళ్ల ముంబై క్రికెటర్ పృథ్వీ షా...

టీమిండియా తరుపున 4 టెస్టులు, 6 వన్డేలు ఆడిన పృథ్వీ షా, వెస్టిండీస్‌పై ఆడిన మొదటి టెస్టులో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మరో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేసిన పృథ్వీ షా... వన్డేల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 

click me!