ధోని వ్యూహాలు అద్భుతం.. అవి ఎవరికీ అంతుచిక్కవు.. చెన్నై సారథిపై ఆర్సీబీ కెప్టెన్ ప్రశంసలు

First Published Mar 1, 2023, 4:53 PM IST

భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన  జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనిపై  సౌతాఫ్రికా మాజీ సారథి  ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్  ప్రశంసలు కురిపించాడు. 

టీమిండియా మాజీ సారథి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  మహేంద్ర సింగ్ ధోనిపై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నాయకుడు ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. ధోని  వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కకుండా ఉంటాయని, అతడితో కలిసి చేసిన ప్రయాణం  తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నాడు. 

ఆర్సీబీ పాడ్‌కాస్ట్ లో  డుప్లెసిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.  తాను ధోనిని చూసి చాలా నేర్చుకున్నానని, కానీ తాను మాత్రం ధోనిలా కాలేనని  చెప్పాడు.  ధోనితో పాటు చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పైనా  డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు.  ప్రపంచంలోనే అత్యుత్తమ లీడర్లలో ఒకరితో  తాను పనిచేశానని చెప్పుకొచ్చాడు. 

Latest Videos


డుప్లెసిస్ మాట్లాడుతూ... ‘నేను గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీలో ఆడాను. స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథ్యాన్ని చూశాను.  ధోని నాయకత్వాన్ని కూడా దగ్గరగా పరిశీలించాను.  కానీ ఈ ముగ్గురిలా నేను కాలేను.  ఈ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిదే.  ఒక వ్యక్తిగా నేను ఎవరనేది తెలియాలంటే నేను నాలా ఉండాలి.  ఎందుకంటే మీరు మీరుగా లేకుంటే ప్రజలు దానిని ఇట్టే గమనిస్తారు. 

చెన్నై జట్టులో  ఆడేందుకు నాకు అవకాశం వచ్చినప్పుడు  చాలా హ్యాపీగా ఫీలయ్యాను.  నా కెరీర్ తొలినాళ్లలోనే నాకు ఈ అవకాశం వచ్చింది. ప్రపంచంలో దిగ్గజ సారథి అనగలిగేవారిలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకడు.   ఆయన సారథ్యంలో నేను పనిచేశాను. ఆటగాళ్ల కంటే వ్యక్తులుగా ఆయన అందరినీ గౌరవిస్తాడు. 

ఇక చెన్నై సారథి  మహేంద్ర సింగ్ ధోని.  మహి వ్యూహాలు ఎవరికీ అందవు.  మ్యాచ్ పై ధోనికి ఉండే అవగాహన ఓ అద్భుతం. పరిస్థితులను బట్టి  తన వద్ద ఉన్న వనరులను ఎలా ఉపయోగించాలన్నది ధోనికి తెలుసు.  ధోని గొప్ప సారథి..’అని కొనియాడాడు. 

కాగా  2021 వరకు డుప్లెసిస్  చెన్నై సూపర్ కింగ్స్ లోనే ఉన్నాడు. 2022 సీజన్ కు ముందు  అతడిని ఆర్సీబీ వేలంలో దక్కించుకుంది.  విరాట్ కోహ్లీ  సారథిగా బాధ్యతలు వదిలేశాక  డుప్లెసిస్ కు వాటిని అప్పగించింది. త్వరలోనే ఈ దక్షిణాఫ్రికా మాజీ సారథి  భారత్ కు రానున్నాడు.  మార్చి చివరివారంలో  ఐపీఎల్ - 16వ సీజన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. 

click me!