Ben Stokes: గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు సిద్ధం..

First Published Oct 25, 2021, 2:49 PM IST

Ashes Series:కాగా, కొద్దిరోజుల  క్రితమే వేలికి ఆపరేషన్ చేయించుకున్న స్టోక్స్.. ప్రస్తుతం  కోలుకున్నాడు. ఈ 30 ఏండ్ల ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. త్వరలో జరిగే యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు.

ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. కొన్ని రోజులుగా  గాయంతో బాధపడుతున్న ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఇందుకు  సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్  క్రికెట్ బోర్డు (ఈసీబీ)  సోమవారం కీలక ప్రకటన చేశాయి. 

ఈ ఏడాది జులై నుంచి మెంటల్ హెల్త్ ఇష్యూతో ఆటకు దూరంగా ఉన్న బెన్ స్టోక్స్.. త్వరలోనే క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. మెంటల్ హెల్త్ తో పాటు చేతివేలికి గాయం కూడా కావడంతో గత జులై నుంచి అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. 

కాగా, కొద్దిరోజుల  క్రితమే వేలికి ఆపరేషన్ చేయించుకున్న స్టోక్స్.. ప్రస్తుతం  కోలుకున్నాడు. ఈ 30 ఏండ్ల ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. త్వరలో జరిగే యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు. 
 

ఈ మేరకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఇందుకు సంబంధించిన విషయాన్ని సోమవారం వెల్లడించింది. స్టోక్స్ మెడికల్ క్లియరెన్స్ కూడా ముగిశాక ఈసీబీ  ఈ నిర్ణయం తీసుకుంది. 
 

యాషెస్ సిరీస్ కోసం నవంబర్ చివరి వారంలో ఇంగ్లండ్ జట్టు ఆసీస్ కు బయలుదేరనుంది. స్టోక్స్ కూడా ఆ జట్టుతో కలువనున్నాడు. డిసెంబర్ 8న తొలి టెస్టు మొదలుకానున్నది.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న స్టోక్స్.. ఈ ఏడాది ఐపీఎల్ తొలి ఎడిషన్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గాయపడ్డాడు. 

తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ ను అందుకోవడానికి డైవ్ చేయబోవడంతో స్టోక్స్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు మే నుంచి గ్రౌండ్ లో అడుగుపెట్టలేదు. ఇటీవలే భారత జట్టు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినా అందులో కూడా స్టోక్స్ ఆడలేదు.

నాలుగు నెలల తర్వాత జట్టుతో చేరడంపై స్టోక్స్ స్పందిస్తూ.. ‘నా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికే నేను విరామం తీసుకున్నాను. ఇంతలో నాకు వేలి ఆపరేషన్ కూడా అయింది. అది విజయవంతమైంది. నేను నా సహచరులను చూడటానికి, వారితో కలిసి మైదానంలో ఆడటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఆస్ట్రేలియా తో యాషెస్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపాడు. 

ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం స్టోక్స్ తిరిగి జట్టులో చేరడం ఇంగ్లండ్ కు లాభిస్తుందని ఈసీబీ అభిప్రాయపడింది.  కొంతకాలంగా స్టోక్స్ ఆటకు దూరంగా ఉన్నా తిరిగి పూర్తిగా సిద్ధమయ్యాడని తెలిపింది. 

యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జొనాథన్ బెయిర్స్టో, డొమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రొరి బర్న్స్, జొస్ బట్లర్, జాక్ క్రాలీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లి పోప్, ఒల్లి రాబిన్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ 

click me!