ఐపీఎల్ 2021 కోసం దుబాయ్‌కి భారత క్రికెటర్లు... ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో...

First Published Sep 10, 2021, 6:30 PM IST

ఐదో టెస్టు కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దు కావడంతో భారత క్రికెటర్లు, అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే యూఏఈకి పయనం కానున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ ప్రకటించారు...

సీఎస్‌కే ప్రత్యేక విమానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు శార్దూల్ ఠాకూర్, ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజాలతో పాటు ఇంగ్లాండ్ జట్టులోని సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ కూడా దుబాయ్ చేరనున్నారు...

బయో బబుల్ నుంచి బయో బబుల్ ట్రాన్స్‌ఫర్‌కి అనుమతి ఉన్నా, భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో గడుపుతారని తెలియచేశాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

సీఎస్‌కేతో పాటు మిగిలిన ప్రాంఛైజీలు కూడా మాంచెస్టర్‌లో ఉన్న భారత, ఇంగ్లాండ్ క్రికెటర్లను, వారి కుటుంబాలను ప్రత్యేక విమానాల్లో యూఏఈకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి...

షెడ్యూల్ ప్రకారం టెస్టు మ్యాచ్ జరిగి ఉంటే, నాలుగో టెస్టులా ఆఖరి టెస్టు ఐదు రోజుల పాటు జరిగితే సెప్టెంబర్ 14న ఆఖరి రోజు ఆట ముగించుకుని యూఏఈకి చేరుకునేవాళ్లు భారత, ఇంగ్లాండ్ ఆటగాళ్లు..

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది... ఈ మ్యాచ్‌కి తమ ప్లేయర్లు అందుబాటులో ఉండేలా పావులు కదుపుతోంది సీఎస్‌కే...

ఫేజ్ 1లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్... సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. సీఎస్‌కే విధించిన భారీ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించి ఉత్కంఠ విజయం అందుకుంది ముంబై...

మరోవైపు ముంబై ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా మాంచెస్టర్ నుంచి యూఏఈ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు...

ఐపీఎల్ కోసం మ్యాచ్ రద్దు చేయలేదని ఇరు జట్ల బోర్డులు ప్రకటించినా, ఇంత హడావుడిగా ప్లేయర్లు యూఏఈకి పయనం కావడం చూస్తుంటే మాత్రం... అందులో నిజం లేదని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!