ఒకేసారి రెండు టీమ్స్, ఆ సిరీసుల్లో సూపర్ హిట్, ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్... టీమిండియాకి 2021 ఏడాదిలో...

First Published Dec 17, 2021, 5:04 PM IST

2021 ఏఢాదిని అదిరిపోయే రేంజ్‌లో ఆరంభించిన భారత క్రికెట్ జట్టు... డ్రెస్సింగ్ రూమ్ గొడవలు, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, బీసీసీఐ మధ్య వివాదాలతో ఏడాదిని ముగించనుంది. 

2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లి, ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోర పరాభావన్ని మూటకట్టుకున్నా, ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో అద్భుత విజయంతో గత ఏడాదిని ముగించింది టీమిండియా...

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా చరిత్రలో నిలిచిపోయే డ్రా సాధించిన భారత జట్టు, గబ్బాలో ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించి... చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది... 

33 ఏళ్లుగా బ్రిస్బేన్‌లోని గబ్బాలో పరాజయం ఎరుగని ఆస్ట్రేలియాకి అశ్విన్, జడేజా, విహారి, ఇషాంత్, షమీ, బుమ్రా వంటి సీనియర్లు లేకుండా చుక్కలు చూపించింది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్, పూజారా, రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్‌లు... భారత క్రికెట్ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాయి...

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో చిత్తుగా ఓడింది. అయితే ఆ తర్వాత వెంటనే కోలుకుని, మిగిలిన మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది టీమిండియా...

అయితే స్పిన్ పిచ్‌లు తయారుచేశారంటూ ఇంగ్లాండ్ జట్టు, భారత జట్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ కూడా భారత జట్టుకే సొంతం కావడంతో రిక్త హస్తాలతో స్వదేశానికి చేరుకుంది ఇంగ్లాండ్...

ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఆరు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టుకి ఏదీ కలిసి రాలేదు. పిచ్, వాతావరణం కూడా కివీస్‌కే అనుకూలంగా మారాయి...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత నెలరోజులు ఇంగ్లాండ్‌లోనే హాలీడేస్ ఎంజాయ్ చేసింది భారత జట్టు. అయితే ఇదే టైంలో యువకులతో నిండిన మరో జట్టు, శ్రీలంకలో పర్యటించింది. ఒకేసారి రెండు భిన్నజట్లతో రెండు భిన్నమైన టోర్నీలు ఆడిన మొదటి జట్టుగా నిలిచింది టీమిండియా...

లంక పర్యటనలో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న శిఖర్ ధావన్ టీమ్, టీ20 సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడం, అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్న కారణంగా ఏకంగా 8 మంది ప్లేయర్లు జట్టుకి దూరం కావడంతో రిజర్వు బెంచ్‌తో ఆఖరి రెండు టీ20 మ్యాచులాడి ఓడింది టీమిండియా...

ఇంగ్లాండ్‌‌తో తొలి టెస్టులో టీమిండియా విజయాన్ని వర్షం దూరం చేసింది. ఆఖరి రోజు టీమిండియా 160 పరుగులు మాత్రమే కావాల్సిన దశలో ఐదో రోజు వర్షం కారణంగా ఆట రద్దయ్యింది. 

ఆ తర్వాత రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం అందుకోగా, మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. నాలుగో టెస్టులో భారత జట్టుకి భారీ విజయం దక్కగా, టీమిండియా సహాయక బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఐదో టెస్టును వాయిదా వేశారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో తొలిసారిగా పాక్ చేతుల్లో ఘోర పరాభవాన్ని అందుకోగా, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లోనూ ఓడి గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు...

కాన్పూర్ టెస్టు పూర్తిగా ఐదు రోజుల పాటు సాగింది. ఆఖరి వికెట్ తీయడంతో భారత జట్టు విఫలం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబై టెస్టులో న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ మ్యాచ్‌లో 372 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

గత ఏడాది డిసెంబర్‌లో ఆడిలైడ్‌లో టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసి చెత్త రికార్డు మూటకట్టుకున్న టీమిండియా, ఈ ఏడాది డిసెంబర్‌లో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.

ఓవరాల్‌గా ఈ ఏడాది భారత జట్టుకి ఐసీసీ టోర్నీలు కలిసి రాలేదు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలోనూ ఓడిన టీమిండియా, ద్వైపాక్షిక సిరీసుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. 

click me!