Cricket Round-up 2021: విరాట్ కోహ్లీకి ఏ మాత్రం కలిసిరాని 2021... ఈ ఏడాది అదొక్కటే...

First Published Dec 17, 2021, 4:04 PM IST

కళ్లు మూసుకునే తెరిచేలోగా కాలచక్రం గిర్రున తిరిగినట్టు, 2021 ఎప్పుడు మొదలైందో తెలియకుండానే 2021 ఏడాది చివరి 14 రోజులకు చేరుకుంది. ఈ ఏడాది భారత జట్టుకి బాగానే కలిసొచ్చేంది. ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్యూర్ కొనసాగినా.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చింది...

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది పెద్దగా కలిసి వచ్చింది లేదు. 2021 ఏడాది ఆరంభంలో జనవరి 11న విరాట్, అనుష్క శర్మలకు వామిక కోహ్లీ జన్మించింది.. ఆ మధుర క్షణాలను తనివితీరా ఆస్వాదించేందుకు ఆస్ట్రేలియా టూర్‌ నుంచి పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేశాడు విరాట్ కోహ్లీ...

ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకున్న విరాట్ సేన, టీ20ల్లో 3-2 తేడాతో సిరీస్ గెలిచింది... వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత జట్టు...

Latest Videos


అక్కడి నుంచి విరాట్ కోహ్లీ బ్యాడ్ టైం మొదలైంది... ఐపీఎల్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించే పర్పామెన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లింది భారత జట్టు...

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్ నెరవేరుతుందని ఆశించిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆరు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టుకి వాతావరణం, పిచ్ ఏవీ కలిసిరాలేదు...

ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగు టెస్టుల్లో రెండు విజయాలు, ఓ పరాజయాన్ని అందుకున్న భారత జట్టు..  లీడ్స్ టెస్టులో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు, టీమిండియాలో కరోనా కేసులు వెలుగుచూడడంతో వాయిదా పడింది...

ఇంగ్లాండ్ టూర్‌ నుంచి నేరుగా యూఏఈ చేరుకుంది విరాట్ టీమ్. ఐపీఎల్ సెకండాఫ్ ఆరంభానికి ముందే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని ప్రకటించాడు విరాట్ కోహ్లీ. వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలిచిన విరాట్ కోహ్లీ, ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఆ తర్వాత కొన్నిరోజులకే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గానూ ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఈ రెండు నిర్ణయాలు విరాట్ కోహ్లీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, మొదటి ఎలిమినేటర్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడి వరుసగా రెండో ఏడాది కూడా నాలుగో స్థానంలోనే ముగించింది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా టైటిల్ లేకుండానే విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్టైంది...

అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఆత్మీయ మిత్రుడు, ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్... ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఏబీడీ లేని లోటు, విరాట్ కోహ్లీపై ఎమోషనల్‌గా ప్రభావం చూపనుంది. 

ఆ తర్వాత టైటిల్ ఫెవరెట్‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బరిలో దిగిన భారత జట్టు, వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే టోర్నీ మొదలయ్యాక సీన్ రివర్స్ అయ్యింది...

మొదటి మ్యాచ్‌లో పాక్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి పాకిస్తాన్ చేతుల్లో ఎదురైన మొట్టమొదటి పరాజయం ఇది...

ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆడిన విధానం చూసి సగటు క్రికెట్ ఫ్యాన్ షాక్‌కి గురయ్యాడు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచినా ఫలితం లేకపోయింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది భారత జట్టు. టీ20 కెప్టెన్‌గా టైటిల్ లేకుండానే కెరీర్‌ను ముగించాడు విరాట్ కోహ్లీ...

అంతేకాకుండా విరాట్ కోహ్లీకి అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా పేరొందిన హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ ఇచ్చాడు...

రాహుల్ ద్రావిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది... దీంతో వన్డే కెప్టెన్‌గానూ విరాట్ కెరీర్ ఐసీసీ టైటిల్ లేకుండానే ముగిసింది...

ఈ ఏడాది కూడా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, గత ఏడాది కంటే మెరుగ్గా పరుగులు చేసినా... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పతనాన్ని చూశాడు. దాదాపు ఐదేళ్లుగా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, ఈ ఏడాది ఆ పొజిషన్‌ను బాబర్ ఆజమ్ కారణంగా కోల్పోవాల్సి వచ్చింది...

అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లలోనూ టాప్ 5లో ఉన్న ఏకైక క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఇయర్ ఎండింగ్‌కి వచ్చేవరికల్లా ఆ రికార్డును కోల్పోవాల్సి వచ్చింది... 

ఓవరాల్‌గా విరాట్ కోహ్లీకి ఈ ఏడాది కూతురు పుట్టడం తప్ప ఏదీ కలిసి రాలేదు. టీ20, వన్డే కెప్టెన్సీతో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వైదొలిగాడు విరాట్ కోహ్లీ...

click me!