భారీ లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్‌కి అదిరిపోయే శుభారంభం అందించారు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్. ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో ఒక్క వికెట్ కోసం పడిగాపులు గాచింది ఆరెంజ్ ఆర్మీ.
తొలి వికెట్‌కి 129 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 44 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన రుతురాజ్, ఐపీఎల్ బెస్ట్ స్కోరు నమోదుచేసి పెవిలియన్ చేరాడు.
వన్‌డౌన్‌లో వచ్చి మొయిన్ ఆలీ 8 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి... కేదార్ జాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
మొయిన్ ఆలీని అవుట్ చేసిన తర్వాతి బంతికే డుప్లిసిస్‌ను పెవిలియన్ చేర్చాడు రషీద్ ఖాన్. 38 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన డుప్లిసిస్, ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై రివ్యూకి వెళ్లినా ఫలితం లేకపోయింది.
రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసినా... అప్పటికే విజయానికి అతిచేరువలోకి వచ్చేసింది చెన్నై సూపర్ కింగ్స్. డుప్లిసిస్ అవుట్ అయ్యే సమయానికి సీఎస్‌కే విజయానికి 24 బంతుల్లో 23 పరుగులు మాత్రమే కావాలి...
సురేశ్ రైనా, రవీంద్ర జడేజా కలిసి లాంఛనాన్ని పూర్తిచేశారు. ఈ విజయంతో వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 8వ స్థానంలోనే ఉండిపోయింది.