టామ్‌ మూడీతో తెగతెంపులు... సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బ్రియాన్ లారా...

First Published Sep 3, 2022, 5:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా సన్‌రైజర్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న టామ్ మూడీలను తప్పించి... ఆ స్థానంలో విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు బ్రియాన్ లారా...
 

Moody and Lara

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుస పరాజయాలతో 14 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి ట్రేవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా వ్యవహరించగా, టామ్ మూడీ క్రికెట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు..


సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆ తర్వాత అతనికి తుది జట్టులో చోటు కూడా కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. 2021 సీజన్ ఫెయిల్యూర్ తర్వాత ట్రేవర్ బేలిస్ తప్పుకోవడంతో హెడ్ కోచ్‌గా టామ్ మూడీ బాధ్యతలు తీసుకున్నాడు.. 

ఇంతకుముందు 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఆరంగ్రేటం నుంచి 2019 వరకూ టామ్ మూడీ... హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో 2016 ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది... 2018లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2016లో ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌తో టామ్ మూడీకి ఉన్న విభేదాల కారణంగానే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి, టీమ్‌కి దూరం చేశాడని వార్తలు వినిపించాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్, వార్నర్‌ని రిటైన్ చేసుకోలేదు... 

రెండు ఆరెంజ్ క్యాప్‌లు గెలిచిన డేవిడ్ వార్నర్‌ని దూరం చేసుకుని, కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే గత రెండు సీజన్లలో కేన్ విలియంసన్ నుంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్‌లు రాలేదు... 

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, గ్లెన్ ఫిలిప్స్ , భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫరూకీ వంటి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
 

సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్... ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని ఓవరాల్‌గా 8వ స్థానంతో ముగించింది.. 

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటిగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శనతో బొక్కలు పడిన పడవగా మారింది. ఈ పడవకు అవసరమైన అతుకులు వేసి, మళ్లీ విజయాల బాటలో నడిపించే బాధ్యతను బ్రియాన్ లారాపై పెట్టింది ఆరెంజ్ ఆర్మీ... 

click me!