Umran Malik: అతడు స్పీడ్ గన్.. ఆ రికార్డులు తుడిచిపారేస్తాడు.. ఉమ్రాన్ మాలిక్ పై మాజీ ఆసీస్ దిగ్గజం కామెంట్స్

First Published May 21, 2022, 6:47 PM IST

Bret lee Lauds Umran Malik: ఐపీఎల్ లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే  వేగంగా బంతులు విసురుతూ ఔరా అనిపిస్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.  తాజాగా అతడిపై ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 
 

వరుసగా అత్యుత్తమ ప్రదర్శనలతో తన ఫాలోయింగ్ ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఇప్పటికే భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆసీస్ పేస్ దిగ్గజం బ్రెట్ లీ కూడా  ఆ జాబితాలో చేరాడు. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ గన్ వంటి వాడు అని..అతడు త్వరలోనే బౌలింగ్ లో అత్యధిక వేగవంతమైన బౌలింగ్ రికార్డులను బద్దలుకొడతాడని అన్నాడు.

బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘అతడిలో వేగం చాలా ఉంది. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమనేది మామూలు విషయం కాదు. దానికి చాలా ఫిట్నెస్ ఉండాలి. ఆ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో ఒళ్లు హూనమైపోతుంది.

ఈ కుర్రాడు (ఉమ్రాన్ మాలిక్)  ను చూస్తుంటే స్పీడ్ గన్ ను చూసినట్టు ఉంది.  ప్రపంచ బౌలింగ్ లో  అత్యంత అరుదుగా సంభవించే గంటకు  160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే రికార్డును ఈ కుర్రాడు త్వరలోనే అందుకుంటాడని నాకు నమ్మకముంది...’ అని తెలిపాడు.

ఉమ్రాన్ బౌలింగ్ శైలి తనను ఎంతగానో ఆకట్టుకున్నదని చెప్పాడు బ్రెట్ లీ.  దాంతో పాటు ఫాస్ట్ బౌలర్ కు ఉండాల్సిన  లక్షణాలపై అతడు మాలిక్ కు పలు కీలక సూచనలు కూడా చేశాడు.

‘ఒక ఫాస్ట్ బౌలర్ కు అతడు బౌలింగ్ చేసే విధానం గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. మీరు ఒక విమానం టేకాఫ్ అయ్యేప్పుడు చూడండి..  మీరు ముందు ఏమి చూస్తారు...? అది టేకాఫ్ అయ్యే విధానం.  వేగంగా రావడం.. దానిని నియంత్రించుకోవడం వంటివి  విమానానికి చాలా ముఖ్యం.

దాని మాదిరే.. ఒక  మంచి ఫాస్ట్ బౌలర్ కూడా అలాంటి విధానమే ఉండాలి. ఉమ్రాన్   బౌలింగ్  కూడా చూడటానికి చాలా బాగుంటుంది.  బ్యాటర్ కు 35 మీటర్ల దూరంలో అతడు.. వేగంతో వచ్చి బంతికి ఫుల్ స్పీడ్ తో సంధిస్తాడు. ఆ ప్రాసెస్ ను  చూడటం నాకు చాలా నచ్చుతుంది..’ అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ - 15 లో సన్ రైజర్స్ తరఫున 13 మ్యాచులాడిన ఉమ్రాన్.. 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది అతడే. అంతేగాక ఈ ఐపీఎల్ లో  అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో బంతి (గంటకు 157 కి.మీ) ని కూడా వేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

click me!