గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం.. బీసీసీఐకి రవిశాస్త్రి కీలక సూచన

First Published Oct 13, 2022, 2:44 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ కు వెళ్లిన టీమిండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఈ మెగా టోర్నీ ఆడుతున్నది. అతడితో పాటు స్టాండ్ బై ప్లేయర్  దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు. 

కీలకమైన టోర్నీలలో ప్రధాన ఆటగాళ్లు గాయపడటం  ఏ జట్టుకైనా తీరని నష్టం చేకూర్చేదే. ఆసియా కప్ కు ముందు భారత జట్టు  బుమ్రా, హర్షల్ పటేల్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఈ ఇద్దరూ ఆ టోర్నీకి దూరమయ్యారు. ఇక తాజాగా టీ20 ప్రపంచకప్ లో కూడా బుమ్రాతో పాటు దీపక్ చాహర్ గాయం కారణంగా తప్పుకున్నారు. 

వీళ్లిద్దరే గాక గత కొన్నాళ్లుగా భారత జట్టులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తరుచూ గాయాల బారిన పడి   కీలక సిరీస్ లకు దూరంగా ఉన్నవాళ్లే. అయితే ఈ సమస్య ఐపీఎల్ వల్లే తలెత్తుతున్నదని దానిని బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  కానీ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం తనదైన సూచన ఇచ్చాడు. 

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం క్రికెట్ లో నిత్య జీవితంలో భాగమైపోయింది.  ప్రతి రోజూ  ఎక్కడో ఓ చోట  మ్యాచ్ లు, ఫ్రాంచైజీ లీగ్ లు జరుగుతూనే ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్లు కూడా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు. అయితే జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్ల విషయంలో బోర్డులు జాగ్రత్తగా ఉండాలి. 

సదరు ఆటగాడు జాతీయ జట్టుకు ఎంత ముఖ్యమనేది గుర్తించి.. అటువంటి వాళ్లు  ఐపీఎల్-దేశానికి  సమప్రాధాన్యమిచ్చేలా  చర్యలు తీసుకోవాలి. దేశానికి ఆడబోయే క్రికెటర్ కు  ఐపీఎల్ లో ఆడకుండా  లేదా కొన్ని కీలక మ్యాచ్ లు మాత్రమే ఆడుతూ విశ్రాంతి కల్పించేలా చూడాలి. అందులో బీసీసీఐ అధ్యక్షుడిదే కీలక పాత్ర.  

ఈ విషయంలో బీసీసీఐ చీఫ్.. ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చలు జరపాలి. టీమ్ మేనేజ్మెంట్ తో కలిసి ఫ్రాంచైజీ యజమానులతో చర్చించి.. సదరు ఆటగాడు దేశానికి ఆడటం ఎంత అవసరం..? అతడి ప్రాధాన్యతను వారికి తెలియజెప్పాలి.   ఎవరైనా క్రికెటర్ కు రెస్ట్ అవసరముందా..? రెస్ట్ ఇస్తే ఏ ప్రాతిపదికన ఇవ్వాలి..? అనేది  చర్చ జరగాలి...’ అని తెలిపాడు. 

తాను కోచ్ గా ఉన్నప్పుడు భారత పేసర్లు పదే పదే గాయాలపాలవడం తనకు ఇబ్బంది కలిగించేందని.. వాళ్లంతా ఎన్సీఏ లో ఉండటంతో తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవాడినని శాస్త్రి తెలిపాడు.

‘నేను హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు భారత పేసర్లు పదే పదే గాయపడి ఎన్సీఏ లో ఉండటం నాకు చిరాకు తిప్పించేది. భారత ప్రధాన ఆటగాళ్లు లేకుండానే మేము ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పర్యటనలకు రెండుసార్లు వెళ్లాల్సి వచ్చింది. ఈ రెండు టూర్స్ కు భువనేశ్వర్ లేడు. అతడెంతో ప్రభావం చూపగలడో నాకు తెలుసు. కానీ గాయం కారణంగా  భువీ మాతో రాలేకపోయాడు. 

మీరు బుమ్రానే తీసుకోండి. గతేడాది  టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత   అతడు ఇప్పటివరకు 5 టీ20లు మాత్రమే ఆడాడు. పదే పదే గాయాల బారిన పడుతున్నాడు. ఈ విషయం మీద బీసీసీఐ  తక్షణమే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలి..’ అని శాస్త్రి కోరాడు. 

click me!