వందో టెస్టులో సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్... టెండూల్కర్ రికార్డును సమం చేస్తూ...

First Published Dec 27, 2022, 10:49 AM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టు సెంచరీ అందుకున్నాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న డేవిడ్ వార్నర్, బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో శతకాన్ని నమోదు చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండేళ్ల విరామాన్ని బ్రేక్ చేస్తూ స్టీవ్ స్మిత్ టెస్టు సెంచరీ బాదగా రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ సెంచరీ బాదాడు...

David Warner

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 189 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖవాజా 1 పరుగు చేసి అవుట్ కాగా మార్నస్ లబుషేన్ 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 75 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్, తన వందో మైలురాయి టెస్టులో అద్భుత సెంచరీ అందుకున్నాడు...

వందో టెస్టులో సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన వందో టెస్టులో శతకం బాదాడు. డేవిడ్ వార్నర్‌కి ఇది కెరీర్‌లో 25వ టెస్టు సెంచరీ... 
 

2017లో టీమిండియాపై ఆడిన వందో వన్డేలో సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్, టెస్టుల్లో 100వ మ్యాచ్‌లోనూ శతకాన్ని నమోదు చేయడం విశేషం. వన్డే, టెస్టుల్లో 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇంతకుముందు జోర్డన్ గ్రీనిడ్జ్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు..  
 

ఓవరాల్‌‌గా వందో టెస్టులో సెంచరీ చేసిన 10వ బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్. ఇంతకుముందు కోడ్రే, జావెద్ మియాందాద్, స్టెవర్ట్, ఇంజమామ్ వుల్ హక్, గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, జో రూట్ ఇంతకుముందు తమ 100వ టెస్టులో శతకం బాదారు..

David Warner

కెరీర్‌లో 45వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్న డేవిడ్ వార్నర్, ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. విరాట్ 72 శతకాలు బాదగా జో రూట్ 44 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు..

టెస్టుల్లో 8 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్న డేవిడ్ వార్నర్, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 45 సెంచరీలు బాదగా డేవిడ్ వార్నర్... మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

click me!