ఆసియా కప్ 2022లో టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్... రాహుల్ ద్రావిడ్ వచ్చేవరకే...

First Published Aug 25, 2022, 1:23 PM IST

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2022 ప్రిపరేషన్స్ కోసం జింబాబ్వే టూర్‌కి దూరంగా ఉన్న రాహుల్ ద్రావిడ్, ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో భారత జట్టుకి మార్గనిర్దేశకత్వం చేశాడు. అయితే టూర్‌కి బయలుదేరేందుకు రెండు రోజుల ముందు రాహుల్ ద్రావిడ్‌కి కోవిద్ సోకినట్టు తేలింది...

VVS Laxman

ఇప్పటికే ఆసియా కప్ 2022 టోర్నీ కోసం భారత జట్టు, విడతలుగా యూఏఈ చేరుకుంది. భారత ప్రధాన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడడంతో ఆయన ఇక్కడే ఉండిపోయాడు. జింబాబ్వే టూర్‌లో, అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్... ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాకి కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు...

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు మరికొందరు క్రికెటర్లు కలిసి ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకుని, ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు... జింబాబ్వే టూర్‌లో పాల్గొన్న కెఎల్ రాహుల్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, దీపక్ చాహార్, అక్షర్ పటేల్ వంటి కొందరు ప్లేయర్లు... నేరుగా హారారే నుంచి దుబాయ్‌కి వచ్చారు...

vvs laxman

వీరితో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా జింబాబ్వే పర్యటనను ముగించుకుని, నేరుగా యూఏఈ చేరుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ గైర్హజరీలో టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు వీవీఎస్ లక్ష్మణ్. హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కుర్ర కెప్టెన్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్, తొలిసారి సీనియర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్‌కి హెడ్ కోచ్‌గా మారాడు...

Dravid and Laxman

రాహుల్ ద్రావిడ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, యూఏఈలోని భారత జట్టుతో కలిసే వరకూ వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియాకి తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ‘మిస్టర్ వీవీఎస్ లక్ష్మణ్, ఎన్‌సీఏ హెడ్ క్రికెట్... యూఏఈలో జరిగే ఏసీసీ ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా సీనియర్ మెన్స్ టీమ్‌కి ఇంటర్మ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు...’ అంటూ తెలియచేసింది బీసీసీఐ...

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న రాహుల్ ద్రావిడ్, కరోనా నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వెంటనే యూఏఈ చేరుకుని భారత జట్టుతో కలుస్తాడు. ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కీ, ఆ తర్వాత ఆగస్టు 31న హంగ్‌కాంగ్‌తో జరిగే మ్యాచ్‌కీ రాహుల్ ద్రావిడ్ అందుబాటులో రావడం అనుమానమే...

గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 3 నుంచి 9 వరకూ ప్లేఆఫ్స్ జరుగుతాయి. ఈ మ్యాచుల సమయానికి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమిండియాకి అందుబాటులోకి వస్తాడు. ఒకవేళ ఆ సమయానికి కూడా రాహుల్ ద్రావిడ్ కోలుకోకపోతే వీవీఎస్ లక్ష్మణ్... ఆసియా కప్ మొత్తానికి హెడ్ కోచ్‌గా ఉంటాడు.

click me!