ఐపీఎల్ డబ్బులిస్తాం, ఛార్టెడ్ ఫ్లైయిట్ ఏర్పాటు చేయండి... ఆస్ట్రేలియాను కోరిన ముంబై ప్లేయర్...

First Published | Apr 27, 2021, 4:25 PM IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు, భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొంటున్న ఆసీస్ క్రికెటర్లు, మధ్యలో నిష్కమించనున్నారు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచే 12 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ లీన్, నాథన్ కౌంటర్‌నీల్, క్రిస్ లీన్, ప్యాట్ కమ్మిన్స్... వంటి ప్లేయర్లు 14వ సీజన్‌లో ఐపీఎల్‌లో ఆడుతున్నారు.
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పటికే ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా స్వదేశానికి పయనం కాగా... మిగిలిన ప్లేయర్లు మే 15లోగా ఆసీస్ రావాలని సూచనలు చేసింది ఆస్ట్రేలియా...

‘నేను క్రికెట్ ఆస్ట్రేలియాతో ఈ విషయం గురించి మాట్లాడాను. ఐపీఎల్ ద్వారా సంపాదించే దానిలో 10 శాతం ఆసీస్ క్రికెట్ బోర్డును ఇస్తున్నాం. ఆ డబ్బును ఈ ఏడాది మా కోసం వినియోగించండి.
ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత లీగ్‌లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఓ ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయండి...అని చెప్పాను’ అంటూ తెలియచేశాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ క్రిస్ లీన్..
‘దేశంలో పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు. అయితే మేం కట్టుదిట్టమైన బయో బబుల్‌లో జీవిస్తున్నాం. వచ్చే వారం వ్యాక్సిన్ కూడా తీసుకోబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని, ప్రైవేట్ జెట్‌లో స్వదేశానికి పంపుతుందని ఆశిస్తున్నా..
మేం షార్ట్‌ కట్స్‌ తీసుకొమ్మని అడగడం లేదు. అయితే రిస్క్ తగ్గించుకోవడానికి టోర్నీ ముగిసిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటిక వెళ్లాలని అనుకుంటున్నాం...
ఇక్కడ పరిస్థితి చూస్తుంటే గుండె తడుక్కుపోతోంది. అయితే మేం ఇంత బాధలోనూ జనాల ముఖాల్లో అంతో ఇంతో నవ్వులు తెప్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ లీన్...
అయితే క్రిస్ లీన్ కోరికకు ఆస్ట్రేలియా ప్రభుత్వం, ‘నో’ చెప్పేసింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు, స్వదేశం చేరడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది.
అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్‌లో పాల్గొంటున్న విదేశీ క్రికెటర్ల భద్రతపై హామీ ఇచ్చింది. టోర్నీ ముగిసిన తర్వాత విదేశీ క్రికెటర్లను క్షేమంగా స్వదేశం చేర్చే పూచీ తాము తీసుకుంటున్నట్టు తెలిపింది.
ఐపీఎల్ 2021 సీజన్ గ్రూప్ మ్యాచులు మే 23 వరకూ జరగనుండగా, క్వాలిఫైయర్ 1 మే 25, ఎలిమినేటర్ 26న, రెండో క్వాలిఫైయర్ మే 28న జరగనుంది. మే 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Latest Videos

click me!