డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ముందు ఇండియా - ఆస్ట్రేలియాకు షాక్.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయాలు

First Published May 27, 2023, 12:29 PM IST

WTC Finals 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్  కు సిద్ధమవుతున్న  టీమిండియా, ఆస్ట్రేలియాకు  భారీ షాక్ తాకింది. ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ లో గాయపడ్డారు. 

ఐపీఎల్-16 లో భాగంగా   శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ముగిసిన రెండో క్వాలిఫయర్ లో  గుజరాత్ టైటాన్స్ చేతిలో  ముంబై ఓడింది. ముంబై ఓటమికి  ఫీల్డింగ్, బౌలంగ్ వైఫల్యాలతో పాటు గాయాలు కూడా అని చెప్పకతప్పదు.  ఆ జట్టు స్టార్ బ్యాటర్లు ఇద్దరూ గాయాలతో సతమతమవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. 

Image credit: PTI

ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తో పాటు స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ లు గాయాలతో ఇబ్బందిపడ్డారు. అయితే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికిప్పుడు   నష్టమేమీ లేకపోయినా  డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోయే భారత్ - ఆస్ట్రేలియాకు  మాత్రం  ఊహించని షాక్ తగిలినట్టే.. 

ఇదివరకే టీమిండియాకు గాయాల బెడద వేధిస్తున్నది. వెన్ను నొప్పి కారణంగా సర్జరీ  చేయించుకుని  జస్ప్రీత్ బుమ్రా,  శ్రేయాస్ అయ్యర్ లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి తప్పుకోగా..  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్  కూడా  ఈ టోర్నీకి అందుబాటులో లేడు. ఐపీఎల్ లో  ఆర్సీబీతో ఈనెల 1న జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ కెఎల్ రాహుల్ కూడా  సర్జరీ బాధితుడే.  జయదేవ్ ఉనద్కత్ కూడా గాయపడ్డా అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. 

ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆటగాడు చేరాడు. రాహుల్ స్థానంలో  డబ్ల్యూటీసీ ఫైనల్ లో రెండో వికెట్ కీపర్ బ్యాటర్ గా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ కూడా ముంబై - గుజరాత్ మ్యాచ్ లో  గాయపడ్డాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో  ఇషాన్.. జోర్డాన్ ను ఢీకొనడంతో అతడి మోచేయి కిషన్ కంటికి బలంగా తాకింది. దీంతో అతడు మైదానం వీడాడు. మళ్లీ  ఫీల్డ్ లోకి రాకపోగా బ్యాటింగ్ కు కూడా రాలేకపోయాడు.  దీంతో కంకూషన్ సబ్ స్టిట్యూట్ కింద విష్ణు వినోద్   బ్యాటింగ్ కు వచ్చాడు. 

అయితే ఇషాన్ గాయంపై  బీసీసీఐ నుంచి ఇప్పటికైతే అధికారిక  ప్రకటన ఏమీ రాలేదు.  ఐపీఎల్ - 16 ఫైనల్ ముగిసిన వెంటనే   టీమిండియా.. ఇంగ్లాండ్ వెళ్లనుంది.  ఈ పది రోజుల గ్యాప్ లో   ఇషాన్ కోలుకుంటాడా..? లేక రిప్లేస్మెంట్ ప్రకటిస్తారా..?  అన్నది తేలాల్సి ఉంది. 

మరోవైపు గ్రీన్ కూడా.. ముంబై బ్యాటింగ్ చేసే క్రమంలో హార్ధిక్  పాండ్యా వేసిన  బంతి మోచేతికి తాకడంతో విలవిల్లాడాడు. ఈ ఏడాది మొదట్లో  చేతి గాయంతో  దక్షిణాఫ్రికా  సిరీస్ నుంచి తప్పుకుని బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియాకు వచ్చినా ఒక్క టెస్టు మాత్రమే ఆడిన గ్రీన్ ఐపీఎల్  లో భాగమయ్యాడు.   అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసిన గ్రీన్.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో  ఆసీస్ కు  ఆల్ రౌండర్ గా సేవలందించనున్నాడు. గ్రీన్ గాయంపై కూడా త్వరలోనే  కీలక ప్రకటన రానున్నది.  గాయం  పెద్దదైతే ఆసీస్ కు షాక్ తగిలినట్టే...!

click me!