ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. బౌలింగ్ చేయడానికి గ్రీన్‌కు రాని అనుమతి.. రూ. 17 కోట్లు వృథానేనా..?

First Published Jan 3, 2023, 3:27 PM IST

IPL 2023: ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్  మినీవేలంలో   ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ పై కాసుల వర్షం కురిసింది. అతడిని ముంబై ఇండియన్స్  ఫ్రాంచైజీ  రూ. 17.50 కోట్లకు దక్కించుకుంది. 

గతేడాది భారత్‌తో  మూడు టీ20ల సిరీస్ సందర్భంగా  జట్టులోకి వచ్చిన యువ ఆల్ రౌండర్  కామెరూన్ గ్రీన్.. మొహాలీలో మోత మోగించడంతో  ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి అతడి మీద పడింది.  రెండో మ్యాచ్ లో విఫలైమనా హైదరాబాద్ లో జరిగిన మూడో మ్యాచ్ లో కూడా గ్రీన్ దుమ్ముదులిపాడు. బ్యాటింగ్ లోనే గాక బౌలర్ గానూ సేవలందించే  గ్రీన్ కు ఐపీఎల్ వేలంలో భారీ దక్కవచ్చునని ముందే ఊహాగానాలు తలెత్తాయి. 

వాటిని నిజం చేస్తూ  గత నెలలో  కొచ్చి వేదికగా ముగిసిన  ఐపీఎల్ వేలంలో  గ్రీన్  కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.   ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కోసం ముంబై ఏకంగా రూ. 17.50 కోట్లు వెచ్చించింది. పొలార్డ్  సేవలను కోల్పోయిన నేపథ్యంలో ఆ జట్టుకు ఆల్ రౌండర్ కొరత ఏర్పడింది. ఈ స్థానాన్ని గ్రీన్ భర్తీ చేస్తాడని భావిస్తున్నది. 
 

మార్చి చివరివారంలో  ఐపీఎల్ మొదలుకావాల్సి ఉండగా గతేడాది దారుణంగా విఫలమైన  ముంబై ఇండియన్స్ ఈసారి తిరిగి  ట్రోఫీ లక్ష్యంగా పావులు కదుపుతున్నది.  ఇందులో భాగంగానే జట్టు కూర్పు, ఇతర  విభాగాల్లో వ్యూహాలు రచిస్తున్నది. ఇదిలాఉండగా  ముంబైకి క్రికెట్ ఆస్ట్రేలియా షాకిచ్చింది. 
 

గ్రీన్ ఐపీఎల్ ఆడేందుకు అనుమతినిచ్చిన  క్రికెట్ ఆస్ట్రేలియా.. అతడిపై పరిమితులు విధించింది.  ఇటీవలే  ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా రెండో టెస్టులో భాగంగా  గ్రీన్  చేతికి గాయమైన విషయం తెలిసిందే.  దీంతో అతడు మూడో టెస్టుకు అందుబాటులో లేడు. గాయం నుంచి కోలుకోవడానికి అతడికి మరో నాలుగు వారాల నుంచి ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

కాగా ఫిబ్రవరిలో భారత్ -ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ లో  గ్రీన్ ఎంపికైతే  బ్యాటింగ్ కే పరిమితమవుతాడు. ఆ  తర్వాత మరో నాలుగైదు వారాల వరకూ  అతడికి బౌలింగ్ చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించకపోవచ్చునని సమాచారం. 

Cameron Green

ఇదే జరిగితే  ముంబై ఇండియన్స్ కు ఇబ్బందులు తప్పవు. గ్రీన్  గాయం తిరగబెట్టినా.. అతడు ఆడినా  బౌలింగ్ చేయడం మాత్రం కష్టమే. ఒకవేళ చేయాల్సి వచ్చినా  అందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనుమతి తప్పనిసరి. 

ఇదే విషయమై  క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘కామెరూన్ గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని  అతడికి ఇప్పటికే  సూచించాం. ఒకవేళ అతడు నాలుగు టెస్టులలో ఆడితే.. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత నుంచి నాలుగు నుంచి ఐదు వారాల దాకా  అతడు బౌలింగ్ చేయడానికి అనుమతి దక్కకపోవచ్చు.. .’ అని తెలిపాడు. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మార్చి 13 వరకు ముగియనుంది.  దీని తర్వాత నాలుగు నుంచి ఆరు వారాలంటే మరో నెలన్నర. అంటే అప్పటికే ఐపీఎల్ ప్రారంభమౌతుంది. మరి దీనిపై ముంబై ఇండియన్స్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. 
 

click me!