ఇండియాతో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం

First Published Dec 1, 2022, 4:14 PM IST

India Tour Of Bangladesh: టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో  భారత్ తో  వన్డే, టెస్టు సిరీస్  ఆడనుంది బంగ్లాదేశ్.   డిసెంబర్ నాలుగు నుంచి   వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ జట్టుకు భారీ షాక్ తాకింది. 

భారత్ తో వన్డే సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ కు ఊహించని షాక్ తాకింది. ఈనెల నాలుగు నుంచి మొదలుకాబోయే  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ముందు ఆ జట్టు ప్రధాన పేసర్ టస్కిన్ అహ్మద్ కు గాయమైంది.  

టస్కిన్  అహ్మద్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం.  క్రిక్ బజ్ లో వచ్చిన కథనం మేరకు..  వన్డే సిరీస్ కు ముందే  టస్కిన్ తనకు  వెన్నునొప్పి  ఉందని టీమ్ మేనేజ్మెంట్ కు తెలియజేశాడట.  దీంతో అతడిని తప్పించి షోరిఫుల్ ఇస్లాంను  జట్టులోకి ఎంపిక చేసినట్టు సమాచారం. 

ఇదే విషయమై  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)   చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెడిన్ క్రిక్ బజ్ తో స్పందిస్తూ.. ‘అవును. వెన్నునొప్పి కారణంగా టస్కిన్  భారత్ తో జరిగే తొలి వన్డేలో ఆడటం లేదు.  మేం అతడిని పర్యవేక్షిస్తున్నాం. తొలి వన్డే ముగిశాక అతడు మిగిలిన రెండు వన్డేలు ఆడాలా..? లేదా..? అనేది నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు. 

టస్కిన్ తో పాటు బంగ్లాదేశ్ కెప్టెన్  తమీమ్ ఇక్బాల్ కూడా  గాయంతో సతమతమవుతున్నట్టు  తెలుస్తున్నది. గజ్జల్లో గాయంతో తమీమ్ బాధపడుతున్నాడని సమాచారం.  తమీమ్  ఆరోగ్యంపై తాము జట్టు ఫిజిషియన్ ను   స్కానింగ్ రిపోర్టులు అడిగామని.. ఈ విషయంలో  త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని  మిన్హాజుల్ తెలిపాడు. 

బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వన్డేలు డిసెంబర్ 4, 7, 10 తేదీలలో జరుగనుండగా  డిసెంబర్ 14-18 మధ్య  తొలి టెస్టు,  22-26 మధ్య  రెండో టెస్టు  జరగాల్సి ఉంది.  ఈ మేరకు భారత జట్టు ఇదివరకే ఢాకా చేరుకుంది. 

click me!