పిచ్‌ను మాకు అనుకూలంగా తయారుచేయలేదు.. రావల్పిండి టెస్టులో ఓటమిపై పాక్ సారథి కామెంట్స్

First Published Dec 6, 2022, 2:51 PM IST

PAKvsENG Test: ఇంగ్లాండ్ తో రావల్పిండి వేదికగా  ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్తాన్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో పిచ్ పై వస్తున్న విమర్శలపై  తాజాగా పాక్ సారథి బాబర్ ఆజమ్ స్పందించాడు. 

బ్యాటర్లు పండుగ చేసుకున్న రావల్పిండి పిచ్ పై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పాక్ సారథి బాబర్ ఆజమ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో పిచ్ తయారుచేసేప్పుడు క్యూరేటర్ కు తాను ఓ రకంగా చెబితే  మరో విధంగా రూపొందించారని బాబర్ తెలిపాడు. 

ఇంగ్లాండ్ తో  టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ స్పందిస్తూ.. ‘అవును, పిచ్ తయారీలో నా ఇన్‌పుట్స్ కూడా ఉన్నాయి.   బంతి కొంచెం టర్న్ అయ్యేవిధంగా పిచ్ తయారు చేయాలని మేం చెప్పాం.  కానీ పిచ్ మాత్రం అందుకు సహకరించలేదు.   వాతావరణ పరిస్థితులో మరేదో గానీ పిచ్ మేం అనుకున్నట్టుగా స్పందించలేదు. 

ఇంగ్లీష్ జట్టు ఇదే అప్రోచ్ (దూకుడుగా) ఆడుతుందని మేం అంచనా వేశాం. బౌలర్లకు సహకరించని పిచ్ పై ప్రత్యర్థి బ్యాటర్లు పండుగ  చేసుకుంటూ ఉండటం, బౌలర్లు వికెట్లు లేక ధారాళంగా పరుగులిచ్చుకోవడం  ఏ జట్టు సారథికైనా  కష్టంగానే ఉంటుంది.  కానీ ఇంగ్లాండ్ మాత్రం  బాగా ఆడింది. 

టెస్టులో తొలిరోజే ప్రత్యర్థి జట్టు 500 పరుగులు చేసినప్పుడు ఇతర జట్లు కోలుకోవడం అనేది చాలా కష్టమైన అంశం.  కానీ ఈ టెస్టులో మేం బాగా పోరాడాం. ఆట చివిరిరోజు  లంచ్ వరకూ మేం గెలుపు కోసం ప్రయత్నించాం.  అయితే టీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. 
 

సెకండ్ ఇన్నింగ్స్ లో  ఇంగ్లాండ్ బౌలర్లు  రాబిన్సన్, అండర్సన్ అద్భుతంగా  బౌలింగ్ చేశారు. క్రెడిట్ అంతా వారికే.. ’ అని బాబర్ తెలిపాడు.  సెకండ్ ఇన్నింగ్స్ లో రాబిన్సన్, అండర్సన్ లు తలా నాలుగు వికెట్లు తీసి పాకిస్తాన్  బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు.  

రావల్పిండి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్  657 పరుగులకు ఆలౌట్ అయింది.  ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ లు సెంచరీలు సాధించారు.  తొలి ఇన్నింగ్స్ లో పాక్ 579 పరుగులు చేసి ధీటుగా బదులిచ్చింది. అనంతరం ఇంగ్లీష్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 264 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ ఎదుట 343 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ  లక్ష్య ఛేదనలో పాక్.. 268 పరుగులకే ఆలౌట్ అయింది. 

click me!