Virat Kohli: వస్తున్నా.. నేనే వస్తున్నా.. మళ్లీ అగ్రపీఠానికి దూసుకొస్తున్న పరుగుల యంత్రం

First Published Sep 14, 2022, 5:14 PM IST

ICC T20I Rankings: దశాబ్దకాలం పాటు  ప్రపంచ క్రికెట్ ను ఏలిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత కొంతకాలం ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. కానీ ఇటీవల మళ్లీ  బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. 

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మళ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంపై గురి పెట్టాడు.  గడిచిన మూడేండ్లలో మునపటి ఫామ్ కోల్పోయి  విమర్శలు ఎదుర్కున్న  విరాట్ కోహ్లీ.. ఫామ్ తో పాటు ర్యాంకింగ్స్ లో  అగ్రస్థానాన్నీ కోల్పోయాడు.  

ఒకప్పుడు మూడు ఫార్మాట్లను ఏలిన ఈ బ్యాటింగ్ రారాజు..  టాప్-10 నుంచి చోటు కోల్పోయాడు. కానీ ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక  నెల రోజుల విరామం తీసుకున్న  రన్ మెషీన్.. మళ్లీ పూర్వవైభవం దిశగా దూసుకొస్తున్నాడు. ఆసియా కప్-2022లో అద్భుతమైన ప్రదర్శనతో గతవారం  ర్యాంకింగ్స్ తో పోలిస్తే  14 స్థానాలు మెరుగుపరుచుకుని  టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. 

ఐసీసీ తాజాగా విడుదల చేసిన   పురుషుల టీ20 ర్యాంకింగ్స్ లో కోహ్లీ.. గతవారంతో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపరుచుకుని 15వ ర్యాంకుకు చేరాడు. అఫ్గానిస్తాన్ పై సెంచరీతో పాటు అంతకుముందు పాకిస్తాన్, హాంకాంగ్ ల మీద రాణించడంతో కోహ్లీ ర్యాంకు గతం కంటే మెరుగైంది. 

Mohammad Rizwan

ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉండటం గమనార్హం.   ఇక  గత వారం మాదిరిగానే మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసియా కప్ లో పేలవ ఫామ్ తో సతమతమైన పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్.. రెండో స్థానం కోల్పోయి మూడో స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్.. రెండో స్థానంలో ఉండగా టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఇక బౌలర్ల జాబితాలో జోష్ హెజిల్వుడ్ అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. షంషి రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ లో టాప్-10 లో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.  భువీ.. 682 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.  

ఆసియా కప్ లో రాణించిన శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ.. గతవారం తో  పోల్చితే  ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని  ఆరో స్థానానికి ఎగబాకాడు. ఆల్ రౌండర్ల జాబితాలో షకిబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. ఆతర్వాత జాబితాలో మహ్మద్ నబీ, మోయిన్ అలీ ఉన్నారు. ఈ జాబితాలో హసరంగ 4 స్థానలు మెరుగై టాప్-4 కు చేరాడు. టీమిండియా నుంచి హార్ధిక్ పాండ్యా.. ఏడో స్థానంలో ఉన్నాడు. 

click me!