86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులు -18 ఏళ్ల కుర్రాడి సంచ‌ల‌న బ్యాటింగ్ తో వ‌ణికిపోయిన బౌల‌ర్లు

First Published | Sep 26, 2024, 9:40 PM IST

498 runs with 86 fours and 7 sixes : వ‌స్తూవ‌స్తూనే గ్రౌండ్ లో బౌండ‌రీల‌తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ సునామీ మొద‌లైంది. ఏకంగా 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులతో 18 ఏళ్ల గుజ‌రాత్ కుర్రాడి సంచ‌ల‌న బ్యాటింగ్  దెబ్బ‌కు బౌల‌ర్లు వ‌ణికిపోయారు.
 

498 runs with 86 fours and 7 sixes : క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్న ప్లేయ‌ర్లు చాలా మందే ఉన్నారు. మైదానంలో ప్రతిరోజూ ఎన్నో అద్భుతాలు క‌నిపిస్తుంటాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు 18 ఏళ్ల కుర్రాడు ఓ అద్భుతం చేశాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఒక్క‌డే 498 ప‌రుగులు చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో అత‌ను విరుచుకుప‌డుతుండ‌టంతో బౌల‌ర్లు కూడా వ‌ణికిపోయారు. 

గుజరాత్ లో యంగ్ ప్లేయర్ ద్రోణ దేశాయ్ స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో తన తుఫాను బ్యాటింగ్‌తో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ 498 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో క్రీడా ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారాడు.

సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే విష‌యం వైర‌ల్ గా మారింది. చాలా చోట్ల అతని గురించి చర్చ జరుగుతుంది. క్రీడా ప్ర‌పంచంలో ఇప్పుడే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించిన ఈ గుజ‌రాతీ కుర్రాడు ఏవ‌రు? ఈ 18 ఏళ్ల యంగ్ బ్యాట్స్‌మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Drona Desai

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన దేవాన్ బల్లూభాయ్ కప్ అండర్-19 టోర్నమెంట్ సందర్భంగా 18 ఏళ్ల ద్రోణ దేశాయ్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో తన పేరును క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులో, దేశాయ్ తన పాఠశాల సెయింట్ జేవియర్స్ (లయోలా) కోసం శివాయ్ క్రికెట్ గ్రౌండ్‌లోని JL ఇంగ్లీష్ స్కూల్ జ‌ట్టుపై 498 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

దేశాయ్ 320 బంతులు ఎదుర్కొంటూ తుఫాను ఇన్నింగ్స్ తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అతని దూకుడు బ్యాటింగ్ తీరు చూసి ఒక్కసారిగా బౌలర్లు సైతం షాక్ అయ్యారు. మ్యాచ్ చూస్తున్న వారు నోరెళ్లబెట్టారు.  అత‌ను త‌న ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 86 ఫోర్లు బాదాడు. 

క్రికెట్ లో ద్రోణ‌ దేశాయ్ ప్ర‌త్యేక రికార్డు

ఈ ఇన్నింగ్స్‌తో ద్రోణ‌ దేశాయ్ స్కూల్ క్రికెట్‌లోని ఎలైట్ రికార్డ్ బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

వారిలో ముంబైకి చెందిన ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), పృథ్వీ షా (546), డాక్టర్ హవేవాలా (515), చమన్‌లాల్ (506 నాటౌట్), అర్మాన్ జాఫర్ (498) ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల రికార్డును కలిగి ఉన్నారు.

ఎవ‌రీ ద్రోణ దేశాయ్? 

యంగ్ క్రికెటర్ ద్రోణ దేశాయ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏడేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించానని చెప్పాడు. అతను సచిన్ టెండూల్కర్‌ను తన ఆరాధ్యదైవంగా భావిస్తాడు.

దేశాయ్ తన ప్రతిభను గుర్తించి, ప్రఖ్యాత కోచ్ అయిన జైప్రకాష్ పటేల్ మార్గదర్శకత్వంలో కోచింగ్ పొందడానికి తన తండ్రి ఎంతో అండ‌గా నిలిచార‌ని తెలిపాడు. జైప్రకాష్ పటేల్ 40 మందికి పైగా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. 

పెద్ద క్రికెటర్‌గా ఎదగాలని ఆశిస్తున్నా:  ద్రోణ దేశాయ్

ద్రోణ దేశాయ్ మాట్లాడుతూ, 'నేను 8 నుండి 12 తరగతి వరకు పరీక్షల కోసం మాత్రమే పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉంది. నేను క్రికెట్ ఆడటం కొనసాగించాను. ఏదో ఒక రోజు పెద్ద పేరు సంపాదించాలని ఆశిస్తున్నాను అని చెప్పాడు.

ద్రోణ దేశాయ్ అండర్-14 స్థాయిలో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని ఇటీవలి ప్రదర్శనతో భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించడం ప‌క్కాగా క‌నిపిస్తోంది.

Latest Videos

click me!