టీమిండియా 36 ఆలౌట్‌కి రెండేళ్లు... ఆడిలైడ్ టెస్టు దెబ్బకి పింక్ బాల్ టెస్టు ఆడేందుకు భయపడుతున్న భారత్..

First Published Dec 19, 2022, 1:27 PM IST

సంతోషం, బాధ రెండూ కలిసి వస్తే... డిసెంబర్ 19 తేదీతో భారత క్రికెట్ జట్టుకి ఇలాంటి అనుబంధమే ఉంది. ఇదే రోజున టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు, 36 పరుగులకే ఆలౌట్ అయ్యి అతి చెత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఆడిలైడ్ టెస్టు ఘోర పరాభవానికి నేటితో సరిగ్గా రెండేళ్లు...

డిసెంబర్ 19, 2016న ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 759 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొయిన్ ఆలీ 146 పరుగులు చేయగా, జో రూట్ 88, లియామ్ డాసన్ 66, అదిల్ రషీద్ 60 పరుగులు చేశారు... 
 

భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ 311 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 199 పరుగులు చేసి, డబుల్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు... పార్థివ్ పటేల్ 71 పరుగులు చేయగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కరణ్ నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... వీరూ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు కరణ్ నాయర్..

ఇది జరిగిన నాలుగేళ్లకు 2020లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 53 పరుగుల ఆధిక్యం సంపాదించి, భారీ అంచనాలతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. అయితే పృథ్వీ షా అవుట్ కావడంతో మొదలైన వికెట్ల పతకం, 45 నిమిషాల్లో టీమ్ అంతా కుప్పకూలే దాకా సాగింది..

మహ్మద్ షమీ గాయపడి రిటైర్ట్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు.మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక స్కోరు. భారత బ్యాటర్లలో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ డకౌట్ అయ్యారు...

ఆడిలైడ్ పరాజయం తర్వాత సెన్సేషనల్ యంగ్ బ్యాటర్ పృథ్వీ షా టెస్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నా రెండేళ్లుగా అతనికి టీమిండియా నుంచి పిలుపు దక్కలేదు. అలాగే టీమిండియా పింక్ బాల్ టెస్టులు ఆడేందుకు కూడా భయపడుతోంది...

ఈ రెండేళ్లలో టీమిండియా ఆడింది ఒకే ఒక్క పింక్ బాల్ టెస్టు. అది కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. ఆడిలైడ్ ఘోర పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది. బ్రిస్బేన్‌లో 32 ఏళ్ల తర్వాత ఆసీస్‌కి తొలి పరాజయాన్ని రుచి చూపించింది భారత జట్టు.

టీమిండియా ఇచ్చిన షాక్ కారణంగానే సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ కోసం నాసిరకం పిచ్‌ని తయారుచేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఓడితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు తగ్గుతాయనే ఉద్దేశంతో గబ్బా పిచ్‌ని బౌలర్లకు అనుకూలంగా రూపొందించి, విమర్శలపాలైంది...

click me!