మాహీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్‌కి 17 ఏళ్లు... జులపాల జట్టుతో ‘దాదా’ రికార్డు బ్రేక్ చేసిన ధోనీ...

First Published | Oct 31, 2022, 11:43 AM IST

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ వేరు. కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించిన ధోనీ, కెరీర్ ఆరంభంలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతని కెరీర్ గ్రాఫ్‌నే పూర్తిగా మార్చేశాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత మాస్‌లో ఆ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి...

మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటైన మహేంద్ర సింగ్ ధోనీ, తన కెరీర్ నాలుగో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు చేశాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో మాహీ, క్రికెట్ ప్రపంచానికి ఘనంగా పరిచయమయ్యాడు...

2005, ఏప్రిల్ 5న తొలి వన్డే సెంచరీ బాదిన మహేంద్రుడు, అదే ఏడాది అక్టోబర్ 31న శ్రీలంకపై చెలరేగిపోయాడు. 299 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సచిన్ టెండూల్కర్ 2 పరుగులకే పెవిలియన్ చేరడంతో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చాడు ఎంఎస్ ధోనీ...


అప్పటికి ధోనీ తొలి సెంచరీ చేసి ఆరు నెలలు దాటింది. మధ్యలో ఆడపాదడపా హాఫ్ సెంచరీలు చేసినా సెంచరీ అయితే చేయలేకపోయాడు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ 39, కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 28, యువరాజ్ సింగ్ 18 పరుగులు చేసి అవుటైనా మరో ఎండ్‌లో మాహీ విశ్వరూపమే చూపించాడు...

145 బంతులు ఆడిన ధోనీ, 210 నిమిషాల పాటు క్రీజులో నిలడి 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు 1999లో శ్రీలంకపై 183 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

వికెట్ కీపర్‌గా వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. అంతేకాకుండా ఛేదనలో సచిన్ టెండూల్కర్ 183 పరుగుల రికార్డులను సమం చేసిన ధోనీ... వన్డే మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

వన్డే మ్యాచ్‌లో 10 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి వికెట్ కీపర్ మాహీయే. అంతేకాదు ఛేజింగ్‌లో 10 సిక్సర్లు కొట్టిన ఏకైన భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు ధోనీ.. 

అంతేకాకుండా ధోనీకి ఇది కెరీర్‌లో రెండో సెంచరీ. వన్డేల్లో రెండో సెంచరీలోనే 175+ పరుగులు బాదిన క్రికెటర్‌గానూ నిలిచాడు మాహీ. ధోనీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు 299 పరుగుల లక్ష్యాన్ని మరో 23 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.ఆ మ్యాచ్‌లో మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 40+ స్కోరు కూడా చేయకపోవడం విశేషం...

శ్రీలంకపై 183 చేసిన సౌరవ్ గంగూలీ, ఆ ఇన్నింగ్స్ తర్వాత రెండేళ్లకు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే అదే శ్రీలంకపై 183 కొట్టిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా రెండేళ్ల తర్వాత భారత సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు...

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ 60 మ్యాచులకు నాయకత్వం వహిస్తే, సౌరవ్ గంగూలీ 49 టెస్టులకు, మహ్మద్ అజారుద్దీన్ 47, సునీల్ గవాస్కర్ 47 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించారు..

అలాగే 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 183 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇది జరిగిన రెండేళ్లకు విరాట్ కోహ్లీ కూడా టీమిండియా కెప్టెన్‌గా (టెస్టుల్లో) బాధ్యతలు తీసుకోవడం విశేషం...

Latest Videos

click me!