యువీ స్పెషల్ ఇన్నింగ్స్‌కి 15 ఏళ్లు... ఫ్లింటాఫ్ ఆ మాట అనగానే సిక్సర్లతో విధ్వంసం సృష్టించి...

First Published Sep 19, 2022, 12:03 PM IST

టీ20 ఫార్మాట్‌ పరిచయమై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు కొట్టడమనేది చాలా స్పెషల్ అఛీవ్‌మెంట్ కిందే లెక్క. ఎవరు వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టినా వెంటనే 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్సర్ల ఇన్నింగ్సే గుర్తుకు వస్తుంది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదాడు యువరాజ్ సింగ్. ఈ ఇన్నింగ్స్‌కి సరిగ్గా నేటితో 15 ఏళ్లు...

యువరాజ్ సింగ్ ఈ లెవెల్‌లో విధ్వంసం సృష్టించడానికి కారణం లేకపోలేదు. ఈ తుఫానుకి కొన్ని నిమిషాల ముందు అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్, యువీ మధ్య మాటల యుద్ధం నడిచింది. యువరాజ్ సింగ్ దగ్గరికి వచ్చిన ఫ్లింటాఫ్, ఏదో అంటూ బౌండరీ లైన్ దగ్గరికి ఫీల్డింగ్‌కి వెళ్లాడు...

అంతే ఆ తర్వాత బంతి నుంచే యువరాజ్ సింగ్ వీరలెవెల్లో రెచ్చిపోయాడు. వరుసగా 1, 2, 3, 4,5,6.. ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే యువీని ఆండ్రూ ఫ్లింటాఫ్ ఎమన్నాడు? ఎందుకుని యువరాజ్‌కి ఇంత ఆవేశం, కోపం వచ్చాయి...

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు యువీ... ‘‘అంతకుముందు ఆండ్రూ ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టాను. ఆ షాట్స్‌తో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. లాస్ట్ బాల్ వేసిన తర్వాత నడుచుకుంటూ వెళుతూ నన్ను సెడ్జింగ్ చేశాడు... చెత్త షాట్స్ ఆడావు... అంటూ హేళన చేశాడు...

ఆ మాటకు నాకు కోపం వచ్చింది. నేను కూడా అంతే గట్టిగా బదులు ఇచ్చాను. అంతే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆండ్రూ ఫ్లింటాఫ్, చాలా కోపంగా నీ గొంతు కోస్తానంటూ బెదిరించాడు. నేను నా బ్యాటుని చూపించి, దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు అంటూ సమాధానం ఇచ్చాను...

ఈ సంఘటన తర్వాతే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నా. ఆ తర్వాతే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కి వచ్చాడు. ప్రతీ బంతినీ స్టేడియం బయటపడేయాలని కసిగా బాదాను... నిజానికి ఆ రోజు నేను ఆడిన షాట్స్‌లో కొన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ ఆడనివి....

స్టువర్ట్ బ్రాడ్‌కి అప్పటికీ పెద్దగా అనుభవం లేదు. అయితే నన్ను కంట్రోల్ చేయడానికి అతను చాలా ప్రయత్నించాడు. యార్కర్లు వేసినా సరే, నేను వాటిని సిక్సర్లుగా మలచగలిగా.... 

ఆఖరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూసి ఓ నవ్వు నవ్వాను. అప్పటికే అతని ముఖం మాడిపోయి ఉంది.... నేను అలా ఆడతానని అతను అస్సలు ఊహంచలేదు. నిజానికి నేను కూడా ఆ ఇన్నింగ్స్ ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్...

Yuvraj singh

క్రికెట్ హిస్టరీలోనే స్పెషల్ ఇన్నింగ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ 6 సిక్సర్ల సునామీకి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశాడు యువరాజ్ సింగ్.. తన కొడుకు ఓరియన్ కీచ్ సింగ్‌తో ఆ మ్యాచ్ వీడియో చూస్తున్న వీడియోను షేర్ చేసిన యువీ... ‘15 ఏళ్ల తర్వాత ఈ ఇన్నింగ్స్‌ని చూడడానికి ఇంతకంటే బెటర్ పార్టనర్‌ ఎవరు దొరుకుతారు..’ అంటూ రాసుకొచ్చాడు. 

click me!