36 బంతుల్లో 113 పరుగులు-మ‌రోసారి ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ విధ్వంసం

First Published | Sep 4, 2024, 11:01 PM IST

AUS vs SCO: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జట్టుగా కొన‌సాగుతున్న‌ ఆస్ట్రేలియా  ప్ర‌స్తుతం స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చింది. ట్రావిస్ హెడ్ తుఫాను ఇన్నింగ్స్ తో తొలి టీ20 మ్యాచ్‌లోనే కంగారూ జట్టు ఓ అద్భుతమైన రికార్డును నెలకొల్పింది.
 

Travis Head : ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు భయపడే ప్లేయ‌ర్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్. భారత్‌కు అతి పెద్ద శత్రువు అనే పదం చెప్పగానే అభిమానులకు ట్రావిస్ హెడ్ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్లేయ‌ర్ భార‌త్ నుంచి రెండు ఐసీసీ ట్రోఫీల‌ను లాగేసుకున్నాడు.

అందులో ఒక‌టి వ‌న్డే ప్రపంచ కప్ 2023, రెండోది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్. ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించిన ఈ స్టార్ ప్లేయ‌ర్ స్కాట్లాండ్ బౌలింగ్ ను చిత్తుచిత్తు చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా జట్టు స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది.

తొలి మ్యాచ్ లోనే ట్రావిస్ హెడ్ తుఫాను  ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రాణాంతక బౌలింగ్ ముందు స్కాట్లాండ్ జట్టు స్కోరు 154కు చేరుకుంది. 155 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌డానికి ఆస్ట్రేలియా  10 ఓవర్లు కూడా తీసుకోలేదు. 

Travis Head

ట్రావిస్ హెడ్ బ్యాట్ విధ్వంసం

0 స్కోరుపై వికెట్ రూపంలో ఆస్ట్రేలియాకు తొలి దెబ్బ తగలడంతో స్కాట్లాండ్ జట్టు ఆనందంలో మునిగిపోయింది. కానీ జట్టు సంతోషం ఎక్కువసేపు నిల‌వ‌లేదు. అవతలి ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ ఈ ఎండ్‌కి వచ్చినా త‌ర్వాత మ్యాచ్ స్వ‌రూపం పూర్తిగా మారిపోయింది. 

బౌలర్లకు చుక్క‌లు చూపిస్తూ త‌న బ్యాట్ తో విరుచుకుప‌డ్డాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ గ్రౌండ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కేవలం 17 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. 25 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు.


Travis Head

ఆస్ట్రేలియా స‌రికొత్త‌ రికార్డు 

ట్రావిస్ హెడ్ తుఫాను ఇన్నింగ్స్‌తో టీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ రికార్డు సృష్టించింది. పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. కంగారూ జట్టు 6 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 

గత ఏడాది వెస్టిండీస్‌పై పవర్‌ప్లేలో 102 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు ట్రావిస్ హెడ్ తుఫాను ఇన్నింగ్స్ తో కంగారు జట్టు ఆ రికార్డును బ్రేక్ చేసింది. 

Image credit: PTI

ముందు బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో  స్కాట్లాండ్ జట్టు బ్యాటింగ్ కు  దిగింది. బ‌ల‌మైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని 155 పరుగుల లక్ష్యాన్ని కంగారుల ముందు ఉంచింది.

స్కాట్లాండ్ జట్టు ప్లేయర్లలో మున్షీ 28 పరుగులు,  మాథ్యూ క్రాస్ 27 పరుగులు, బెరింగ్టన్ 23 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.  కంగారు బౌలర్లలో అబాట్ 3 వికెట్లు, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. 
 

Travis Head

ఆస్ట్రేలియా కేవలం 0 స్కోరుతో తొలి వికెట్ (జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్) తో కోల్పోయింది. కానీ, ఆ త‌ర్వాత ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తుఫాను ఇన్నింగ్స్ తో  జట్టును కేవలం 9.4 ఓవర్లలో మ్యాచ్‌ను గెలుచుకుంది. టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ట్రావిస్ హెడ్ 25 బంతుల్లో 80 ప‌రుగులు, మార్ష్ 12 బంతుల్లో 39 ప‌రుగుల ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడారు. జోష్ ఇంగ్లిస్ 27* ప‌రుగులు, మార్కస్ స్టోయినిస్ 8* ప‌రుగుల‌తో కంగారుల జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.

Latest Videos

click me!