11 సిక్స్‌లు, 15 ఫోర్లు.. 17 ఏళ్ల బ్యాట్స్‌మెన్ విధ్వంసంతో జైస్వాల్ ప్రపంచ రికార్డు బ‌ద్ద‌లు

First Published | Jan 1, 2025, 10:23 AM IST

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో నాగాలాండ్ పై ముంబై 189 పరుగుల తేడాతో విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించిన 17 ఏళ్ల 168 రోజుల ఆయుష్ మ్హత్రే.. లిస్ట్ ఏ క్రికెట్ లో 150కి పైగా పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా ఘ‌న‌త సాధించాడు.

Ayush Mhatre

Vijay Hazare Trophy: దేశ‌వాళీ క్రికెట్ టోర్న‌మెంట్ విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్లు అద‌ర‌గొడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు లిస్ట్ ఏ క్రికెట్ లో రికార్డుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే భార‌త యంగ్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ పేరు ముందుగా వినిపిస్తుంటుంది. ఇప్పుడు జైస్వాల్ ప్ర‌పంచ రికార్డును ఒక యంగ్ ప్లేయ‌ర్ బ‌ద్ద‌లు కొట్టాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ప‌రుగులు వ‌ర్షం కురిపించాడు. అత‌నే ఆయుష్ మ్హత్రే. 

లిస్ట్ ఏ క్రికెట్‌లో 150 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఆయుష్ మ్హత్రే య‌శ‌స్వి జైస్వాల్ రికార్డును బ్రేక్ చేశాడు. మంగ‌ళ‌వారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్ ఏ క్రికెట్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా ముంబైకి చెందిన ఆయుష్ మ్హత్రే కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Ayush Mhatre

యశస్వి జైస్వాల్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఆయుష్ మ్హత్రే

ఆయుష్ మ్హత్రే అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియా యంగ్ ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ రికార్డు బ‌ద్ద‌లు అయింది. 17 ఏళ్ల 168 రోజుల వయసులో భారత ఓపెనర్ జైస్వాల్ పేరిట ఉన్న రికార్డును ఆయుష్ మ్హత్రే బద్దలు కొట్టాడు. 2019లో జార్ఖండ్‌పై ఈ 150 ప‌రుగుల మార్కును అంతుకున్న‌ ఘనత సాధించినప్పుడు జైస్వాల్ వయసు 17 ఏళ్ల 291 రోజులు. ఈ సీజన్ ప్రారంభంలో ముంబై తరఫున ఆయుష్ అరంగేట్రం చేశాడు. అప్ప‌టినుంచి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడుతున్నాడు. 


Ayush Mhatre

ఫోర్లు, సిక్సర్లతోనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు స‌మాధాన‌మిచ్చిన ఆయుష్ మ్హత్రే

నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆయుష్ మ్హత్రే , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR) స్టార్ అంగ్క్రిష్ రఘువంశీతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మొద‌టి నుంచి దూకుడుగా ఆడిన ఆయుష్ కేవ‌లం 117 బంతుల్లో 181 పరుగుల భారీ  ఇన్నింగ్స్ ను ఆడాడు. త‌న ఇన్నింగ్స్ ఆయుష్ 11 సిక్స‌ర్లు, 15 ఫోర్లు బాదాడు. గ్రౌండ్ కు అన్ని దిశ‌లా అద్భుత‌మైన షాట్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తో లిస్ట్ ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఆయుష్ నిలిచాడు .

లిస్ట్ ఏ క్రికెట్‌లో 150 పరుగులు  చేసిన అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు

17సంవ‌త్స‌రాల‌ 168 రోజులు - ఆయుష్ మ్హత్రే (ముంబై)
17సంవ‌త్స‌రాల 291 రోజులు - యశస్వి జైస్వాల్ (ముంబై)
19 సంవ‌త్స‌రాల 63 రోజులు  - రాబిన్ ఉతప్ప (కర్ణాటక)
19 సంవ‌త్స‌రాల 136 రోజులు - టామ్ పెర్స్ట్ (హాంప్‌షైర్)

Ayush Mhatre

మూడు ఫార్మాట్ల‌లో ఇర‌గ‌దీస్తున్న ఆయుష్ మ్హత్రే

మూడు ఫార్మాట్లలో బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు ఆయుష్ మ్హత్రే. ఇరానీ కప్ గెలిచిన ముంబై జట్టులో అతను సభ్యుడుగా ఉన్నాడు. రంజీల్లోనూ మంచి ఇన్నింగ్స్ లతో పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే మ్హత్రే 71 బంతుల్లో 52 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన అరంగేట్రం చిరస్మరణీయమైన తర్వాత, అతను మహారాష్ట్రపై 232 బంతుల్లో 22 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 176 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండో సెంచరీ సాధించాడు. అండర్-19 ఆసియా కప్‌లో కూడా మ్హత్రే అద్భుత ప్రదర్శన చేశాడు.

Ajinkya Rahane

విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశకు రహానే దూరం 

సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశకు దూరమయ్యాడు. రహానే ఇప్పటివరకు టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. చివరి రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. "రహానే విరామం కోసం అభ్యర్థించాడు, కానీ అతను నాకౌట్‌లకు అందుబాటులో ఉంటాడని మాకు హామీ ఇచ్చాడు" అని ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభయ్ హడప్ తెలిపారు. 

పంజాబ్, కర్ణాటక చేతిలో ఓడిపోయిన ముంబై ఐదు మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో గ్రూప్ సిలో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, నాకౌట్‌కు అర్హత విష‌యంలో కొద్దిగా ఆశలు మాత్రమే ఉన్నాయి.

స్కోర్ బోర్డు: 
ముంబై: 50 ఓవర్లలో 403-7 (అంగ్క్రిష్ రఘివంశీ 56, ఆయుష్ మ్హత్రే 181, సిద్ధేష్ లాడ్ 39, ప్రసాద్ పవార్ 38, శార్దూల్ ఠాకూర్ 73; డిప్ బోరా 3-87)

నాగాలాండ్: 214-9 , జె సుచిత్ 104; శార్దూల్ ఠాకూర్ 3-17, రాయిస్టన్ డయాస్ 2-44, సూర్యాంశ్ షెడ్జ్ 2-25) 189 పరుగుల తేడాతో ముంబై గెలుపు 

Latest Videos

click me!