
SUV అంటే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (Sports Utility Vehicle). ఇవి ఎత్తైన బాడీ, బలమైన నిర్మాణం, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటాయి. గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై సులభంగా ప్రయాణించవచ్చు. అందుకే ఆఫ్‌రోడ్ ప్రయాణాలు ఇష్టపడేవారికి ఇవి అనుకూలం. SUVల్లో సాధారణంగా 5 నుంచి 7 మంది ప్రయాణించవచ్చు. వెనుక సీట్లను మడతపెట్టి లగేజీ కోసం ఎక్కువ స్థలం ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని మోడళ్లలో AWD, 4WD సదుపాయాలు కూడా ఉంటాయి.
ఈ కారు ప్రయోజనాల విషయానికొస్తే.. శక్తివంతమైన ఇంజిన్, మంచి డ్రైవింగ్ సామర్థ్యం ఉంటుంది. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కువ లగేజీ పెట్టుకునే సదుపాయంతో పాటు ఆఫ్‌రోడ్, లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ కారు ధర, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మోడళ్లలో మైలేజీ తక్కువగా ఉంటుంది.
MUV అంటే మల్టీ యుటిలిటీ వెహికల్ (Multi Utility Vehicle). వీటిని ప్రధానంగా ఎక్కువ మంది ప్రయాణించేందుకు, ఎక్కువ లగేజీ తీసుకెళ్లేందుకు రూపొందిస్తారు. లోపల విశాలమైన స్థలం ఉండటం వీటి ప్రత్యేకత. MUVల్లో సాధారణంగా 7 నుంచి 9 మంది ప్రయాణించవచ్చు. అవసరాన్ని బట్టి వెనుక సీట్లను మడతపెట్టుకుని ఎక్కువ సామాను తీసుకెళ్లవచ్చు. పెద్ద కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు, టూర్లకు ఇవి అనుకూలం. SUVలతో పోలిస్తే వీటికి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండవచ్చు. అయితే కారులోకి ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది. ఈ కార్ల ప్రయోజనాల విషయానికొస్తే ఎక్కువ మంది ప్రయాణించేందుకు విశాలమైన సీటింగ్, కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కార్లలో మంచి మైలేజీ అందించే మోడళ్లు ఉన్నాయి, అలాగే నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
XUV అంటే క్రాస్ యుటిలిటీ వెహికల్ (Cross Utility Vehicle). ఇవి SUV, MUV తరహా కార్లలోని కొన్ని ప్రత్యేకతలను కలిపి రూపొందించిన వాహనాలు. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన ప్రయాణం వీటి ప్రత్యేకతలు. XUVల్లో విశాలమైన ఇంటీరియర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అధునాతన భద్రతా సదుపాయాలు ఉంటాయి. కొన్ని మోడళ్లలో AWD, మరికొన్నింటిలో FWD వ్యవస్థ ఉంటుంది. నగర ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ కారు ప్రయోజనాల విషయానికొస్తే ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు, నగర, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక సౌకర్యవంతమైన ఇంటీరియర్ కూడా ఉంటుంది.
ఈ మూడు రకాల కార్ల మధ్య ప్రధానంగా పనితీరు, మైలేజీ, సీటింగ్, ధరలో తేడాలు ఉంటాయి. పనితీరు విషయానికొస్తే.. ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు SUVలు మెరుగైన ఎంపిక. నగర ప్రయాణాలు, హైవే ప్రయాణాలకు XUVలు అనుకూలం. MUVలు కుటుంబ అవసరాలకు ప్రాధాన్యంఇస్తాయి. అలాగే ధర పరంగా చూస్తే.. సాధారణంగా SUVల ధర ఎక్కువగా ఉండవచ్చు. MUVల్లో బడ్జెట్‌కు అనుకూలమైన మోడళ్లు లభిస్తాయి. XUVల ధర వాటి ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
మైలేజీ విషయానికొస్తే.. సాధారణంగా MUVలు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. SUVల్లో శక్తివంతమైన ఇంజిన్ల కారణంగా మైలేజీ కొంత తక్కువగా ఉండవచ్చు. XUVల మైలేజీ మోడల్‌ను బట్టి మారుతుంది. పెద్ద కుటుంబాలకు MUVలు అనుకూలం. SUV, XUVల్లో సాధారణంగా 5 నుంచి 7 సీట్ల సదుపాయం ఉంటుంది. భద్రతపరంగా చూస్తే.. ఈ మూడు రకాల కార్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు మోడల్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి.
కారు కొనుగోలు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య, బడ్జెట్, రోజువారీ ప్రయాణాలు, మైలేజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆఫ్‌రోడ్ ప్రయాణాలు ఇష్టమైతే SUVను ఎంచుకోవచ్చు. అదే విధంగా పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ సీటింగ్ సౌకర్యం ఉన్న MUV మంచిది. ఇక స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు కావాలంటే XUVను పరిశీలించవచ్చు. రోజువారీ నగర ప్రయాణాల కోసం మైలేజీ, డ్రైవింగ్ సౌకర్యాన్ని బట్టి MUV లేదా XUV ఎంచుకోవచ్చు. మొత్తంగా SUVలు పనితీరు, ఆఫ్‌రోడ్ సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తాయి. MUVలు కుటుంబ సౌకర్యం, ఎక్కువ సీటింగ్ కోసం ఉపయోగపడతాయి. XUVలు స్టైల్, సౌకర్యం, పనితీరు కలయికగా ఉంటాయి. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు టెస్ట్ డ్రైవ్ చేసి, ధర, మైలేజీ, భద్రత, నిర్వహణ ఖర్చులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.