
ఆఫ్‌రోడ్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త మహీంద్రా థార్ 3-డోర్ వర్షన్ భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈసారి దీని పేరును ‘మహీంద్రా థార్ OG’ గా మార్చారు. గత నెలలో BE 6 SPORTEQ మోడల్‌ను తీసుకొచ్చిన మహీంద్రా, ఇప్పుడు థార్ లవర్స్ కోసం ఈ కొత్త వర్షన్‌ను రిలీజ్ చేసింది. పాత థార్ ఐకానిక్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, సరికొత్త ఫ్రంట్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, లేటెస్ట్ ఫీచర్లు, టాప్-నాచ్ సేఫ్టీతో దీనిని డిజైన్ చేశారు. ఈ కొత్త థార్ OG కి సంబంధించిన పూర్తి వివరాలు, వేరియంట్లు, ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మహీంద్రా థార్ OG బయట డిజైన్ పరంగా చాలా రిఫ్రెషింగ్‌గా మారింది. దీని ఫ్రంట్ లుక్ చూడగానే థార్ రాక్స్ గుర్తుకొస్తుంది. ఇందులో కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్, కొత్త డిజైన్ గ్రిల్‌ను అందించారు. ఫాగ్ ల్యాంప్స్‌ను ఫెండర్‌పైకి జరిపి, వాటికి కూడా ఎల్ఈడీ టెక్నాలజీని ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 19-ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ బంపర్ ఉన్నాయి. ఈ కార్ లో ఆర్టెమిస్ సిల్వర్, జీన్స్ బ్లూ అనే రెండు కొత్త రంగులతో పాటు ఎవరెస్ట్ వైట్, టాంగో రెడ్, స్టీల్త్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ గ్రే, గెలాక్సీ గ్రే, డిస్ డిప్ ఫారెస్ట్ వంటి మొత్తం 8 ఆకర్షణీయమైన కలర్స్ లభిస్తున్నాయి.
లోపల క్యాబిన్ అనుభవాన్ని మహీంద్రా మరింత ప్రీమియంగా మార్చింది. కారు ఇంటీరియర్‌లో కొత్త ట్రఫుల్ బ్రౌన్ లెథరెట్ సీట్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ రగ్గడ్ లుక్‌ను ఇస్తాయి. వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు, కప్‌హోల్డర్లను కూడా చేర్చారు. ఫీచర్ల విషయానికి వస్తే, 10.25-ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే), ప్లాట్‌ఫారమ్ అప్‌గ్రేడ్‌తో వస్తున్న వైర్‌లెస్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్, డ్రైవ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
కార్లలో భద్రతకు పెద్దపీట వేస్తున్న మహీంద్రా, థార్ OG లో భద్రతా ప్రమాణాలను భారీగా పెంచింది. టాప్ వేరియంట్‌లో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. అంతేకాకుండా, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP 9.3), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రీవియస్ మోడల్ గ్లోబల్ ఎన్సీఏపీ లో 4 స్టార్స్ సాధించగా, ఈ అప్‌డేటెడ్ మోడల్ కూడా అంతే సేఫ్టీ రేటింగ్ సాధిస్తుందని భావిస్తున్నారు.
మహీంద్రా థార్ OG మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ CRDe డీజిల్ (117 hp / 300 Nm), 2.2-లీటర్ mHawk డీజిల్ (150 hp / 330 Nm), 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ (160 hp / 330 Nm) ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తొలిసారిగా పెద్ద డీజిల్ ఇంజిన్‌ను రియర్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్‌లో కూడా అందిస్తున్నారు. ఆఫ్‌రోడింగ్ కోసం ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, టెర్రైన్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. స్టీరింగ్‌ను డ్రైవ్ చేయడం సులభతరం చేసేందుకు హైడ్రాలిక్ స్టీరింగ్ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ను ప్రవేశపెట్టారు.
కొత్త థార్ OG కి సంబంధించి డెలివరీలు అక్టోబర్ 11 నుండి ప్రారంభం కానున్నాయి. ఇవి ఇంట్రడక్టరీ ధరలు కాగా, నవంబర్ 30 వరకు డెలివరీ అయ్యే వాహనాలకు ఇవే వర్తిస్తాయి.
పెట్రోల్ వేరియంట్లు (2.0L Turbo-Petrol):
• LXT RWD AT: రూ. 14.77 లక్షలు
• LXT 4WD MT: రూ. 15.60 లక్షలు
• LXT 4WD AT: రూ. 17.23 లక్షలు
• ZXT RWD AT: రూ. 16.09 లక్షలు
• ZXT 4WD MT: రూ. 16.60 లక్షలు
• ZXT 4WD AT: రూ. 17.75 లక్షలు
డీజిల్ వేరియంట్లు (1.5L & 2.2L Diesel):
• AXT 1.5L RWD MT: రూ. 10.32 లక్షలు
• LXT 1.5L RWD MT: రూ. 12.99 లక్షలు
• LXT 2.2L RWD AT: రూ. 16.49 లక్షలు
• LXT 2.2L 4WD MT: రూ. 16.43 లక్షలు
• LXT 2.2L 4WD AT: రూ. 18.00 లక్షలు
• ZXT 1.5L RWD MT: రూ. 13.99 లక్షలు
• ZXT 2.2L RWD AT: రూ. 17.49 లక్షలు
• ZXT 2.2L 4WD MT: రూ. 17.49 లక్షలు
• ZXT 2.2L 4WD AT: రూ. 18.99 లక్షలు
మహీంద్రా థార్ OG తన పాత ధరకే అంటే రూ. 10.32 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులోకి రావడం కస్టమర్లకు నిజంగా గుడ్ న్యూస్. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఫోర్స్ గుర్ఖా, మారుతి జిమ్నీ మోడళ్లకు ఈ థార్ OG గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.