వామ్మో! ఆ బంగారు గని విలువ రూ. 7 లక్షల కోట్లా? ఇది ఎక్కడుందో తెలుసా?

First Published | Nov 30, 2024, 2:36 PM IST

ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పెద్ద బంగారు నిల్వలున్న గని గా నిలిచిన దక్షిణాఫ్రికా గని కంటే పెద్ద గని ఇటీవల బయటపడింది. దీని విలువ రూ. 7 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఆ బంగారు గని ఎక్కడుంది? ఏ దేశం ఆధీనంలో ఉంది. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

బంగారం అంటే భారతదేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం మీదా చాలా క్రేజ్ ఉన్న ఖనిజం. మన దేశంలో అయితే నగలుగా మార్చి ధరిస్తారు. కొన్ని దేశాల్లో బంగారాన్ని ఆస్తిగా నిల్వ చేసుకుంటారు. అందుకే చాలా మంది అవసరాలు తీర్చుకున్నా లేకపోయినా బంగారం మాత్రం కొంటూ ఉంటారు. అంత ఖరీదైన ఖనిజం తమ వద్ద ఎక్కువగా ఉందని ఇటీవల చైనా ప్రకటించింది.

1,000 మెట్రిక్ టన్నుల ప్రీమియం నాణ్యత కలిగిన బంగారు గని ఉందని చైనా చెబుతోంది. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలోని ఇటీవల వెలుగు చూసిన ఈ బంగారు గనిలో దాదాపు 600 బిలియన్ యువాన్ ల విలువైన బంగారం ఉందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా రూ. 7 లక్షల కోట్లు ఉంటుంది. 

ఇప్పటి వరకు 930 మెట్రిక్ టన్నులతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా దక్షిణాఫ్రికా బంగారు గని ఉండేది. చైనాలో ఈ బంగారు గని వెలుగు చూడటంతో ప్రపంచంలో అతి పెద్ద బంగారు గనుల్లో దక్షిణాఫ్రికాలో ఉన్న లోతైన గని రెండో స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతానికి చైనా బంగారు గనిలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారం వెలికితీయవచ్చని సమాచారం. దీనిపై జరిపిన అధికారిక అధ్యయనంలో అధునాతన 3D భౌగోళిక సాంకేతికతను ఉపయోగించారు. దీని ప్రకారం 3 కి.మీ. లోతు వరకు బంగారం ఉండవచ్చని తెలుస్తోంది.


చైనా లోని హునాన్ జియోలాజికల్ బ్యూరో డిప్యూటీ హెడ్ లియు యోంగ్జున్ మాట్లాడుతూ ఈ బంగారు గని బయటపడటం చైనా చరిత్రతో ఒక ముఖ్యమైన ఘట్టం అని అన్నారు. భూగర్భ నిధిని వెలికితీయడంతో తాము 3D మోడలింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించామని తెలిపారు. ఈ సంపద చైనా ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేస్తుందని ఆ దేశ నాయకులు భావిస్తున్నారు. ఈ గని చైనా బంగార ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని, కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు.

చైనాలో బంగారు గని వెలుగుచూడనంత వరకు ప్రపంచంలోని అతి ముఖ్యమైన బంగారు గనులు దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, రష్యా, అమెరికా వంటి దేశాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు చైనాలోని పింగ్జియాంగ్ కౌంటీ బంగారు గని ప్రపంచ పటంలో కీలక స్థానాన్ని సంపాదించింది. దీంతో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాలను కూడా చైనా అధిగమించిందని చైనా ప్రకటించుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైన బంగారు గనుల వివరాలు ఇవిగో..

సౌత్ డీప్ బంగారు గని, దక్షిణాఫ్రికా
గ్రాస్‌బర్గ్ బంగారు గని, ఇండోనేషియా
ఒలింపియాడా బంగారు గని, రష్యా
లిహిర్ బంగారు గని, పాపువా న్యూ గినియా
నార్టే అబియెర్టో బంగారు గని, చిలీ
కార్లిన్ ట్రెండ్ బంగారు గని, అమెరికా
బోడింగ్టన్ బంగారు గని, ఆస్ట్రేలియా
ఎంపోనెంగ్ బంగారు గని, దక్షిణాఫ్రికా
ప్యూబ్లో వీజో బంగారు గని, డొమినికన్ రిపబ్లిక్
కోర్టెస్ బంగారు గని, అమెరికా

Latest Videos

click me!