ఎవరైనా చనిపోతే వారి ఆధార్, పాన్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ ఏం చేయాలో మీకు తెలుసా?

First Published | Nov 30, 2024, 12:27 PM IST

ప్రతి ఒక్కరికి ఆధార్, పాన్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లు చాలా ముఖ్యమైనవి కదా.. మనందరికీ ఇవన్నీ కచ్చితంగా ఉంటాయి. మరి ఎవరైనా చనిపోతే ఈ ముఖ్యమైన కార్డులు, డాక్యుమెంట్లు ఏం చేయాలో మీకు తెలుసా? ఈ డాక్యుమెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్, పాన్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఏం చేయాలనేది చాలా మందికి ఉండే అనుమానమే. ఎందుకంటే వీటిని ఉపయోగించి అనేక ప్రభుత్వ పథకాలు అమలు అవుతుంటాయి. వ్యక్తి చనిపోయినప్పుడు ఆ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియజేయకపోతే ఆ వ్యక్తి పొందుతున్న స్కీమ్ బెనిఫిట్స్ మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కార్డులతో మోసగాళ్లు మోసాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

ఆధార్ కార్డు

12 ప్రత్యేకమైన అంకెలతో ఉండే ఆధార్ కార్డు వ్యక్తి గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది. LPG సబ్సిడీలు, EPF ఖాతాలు వంటి అనేక సేవలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడానికి ప్రస్తుతం ఎలాంటి అధికారిక ఏర్పాటు లేదు.

UIDAI ఇంకా రాష్ట్ర మరణాల రిజిస్టర్లతో దాని వ్యవస్థను అనుసంధానించలేదు. మరణాల నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదు. మరణించిన వారి వారసులే ఆధార్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. బయోమెట్రిక్ డేటాను రక్షించడానికి, వారు UIDAI వెబ్‌సైట్‌ని ఉపయోగించి మరణించిన వ్యక్తి బయోమెట్రిక్స్‌ను లాక్ చేయవచ్చు.

Latest Videos


పాన్ కార్డు

పాన్ కార్డు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి, బ్యాంక్ ఖాతాలను నిర్వహించడానికి, ఆర్థిక లావాదేవీలు చేయడానికి అవసరం. పెండింగ్‌లో ఉన్న ఐటీఆర్‌లను ఫైల్ చేయడం, బ్యాంక్ ఖాతాలను మూసివేయడం లేదా డబ్బును ఉపసంహరించుకోవడం వంటి అన్ని ఆర్థిక బాధ్యతలు పూర్తయ్యే వరకు పాన్ కార్డును ఉంచుకోవడం మంచిది.

మీరు మరణించిన వారి పాన్ కార్డు ను డీయాక్టివేట్ చేయించాలని అనుకుంటే పాన్ రిజిస్టర్డ్ అసెస్సింగ్ ఆఫీసర్ (AO)కి లెటర్ రాయండి. మరణించిన వ్యక్తి పేరు, పాన్, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం కాపీని జతచేయండి. పాన్‌ను సరెండర్ చేయడం తప్పనిసరి కాదు. కానీ ఆర్థిక లావాదేవీలు పరిష్కారమైన తర్వాత దీన్ని చేయవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్

మరణించిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం గురించి ప్రతి రాష్ట్రానికి స్పెషల్ రూల్స్ ఉన్నాయి. లైసెన్స్ సరెండర్ కోసం కేంద్రీకృత వ్యవస్థ లేనప్పటికీ, వారసులు మార్గదర్శకత్వం కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని(RTO) సంప్రదించి వారి విధానాలను అనుసరించవచ్చు. మరణించిన వ్యక్తి వాహనం కలిగి ఉంటే ఆయన వారసులు ట్రాన్స్ ఫర్ పెట్టుకోవచ్చు. 

RTO కార్యాలయానికి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. వారసులకు లైసెన్స్‌ను బదిలీ చేసే విధానం గురించి RTO అధికారులు పూర్తి వివరాలను అందిస్తారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఈ డాక్యుమెంట్లను బాధ్యతాయుతంగా నిర్వహించడం వల్ల దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. 

ఓటరు ఐడీ

ఓటరు ఐడీ పౌరసత్వం, ఓటు హక్కుకు రుజువుగా పనిచేస్తుంది. 1960 ఓటరు నమోదు నియమాల ప్రకారం మరణించిన వ్యక్తి ఓటరు ఐడీని మరణ ధృవీకరణ పత్రం కాపీతో స్థానిక ఎన్నికల కార్యాలయంలో ఫారమ్ 7తో సమర్పించి రద్దు చేయవచ్చు. ప్రాసెస్ అయిన తర్వాత ఓటరు జాబితా నుండి వ్యక్తి పేరు తొలగిస్తారు. 

పాస్‌పోర్ట్

పాస్‌పోర్ట్ అనేది ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రయాణ డాక్యుమెంట్. మరణించిన వ్యక్తి పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయడం లేదా రద్దు చేయవలసిన అవసరం లేదు. గడువు ముగిసినప్పుడు దానికదే రద్దు అయిపోతుంది. అయితే ధృవీకరణ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగకరమైన డాక్యుమెంట్‌గా ఉంచుకోవచ్చు.

click me!