బంగారం అంటే ఇష్టం లేనివాళ్లు ఉంటారా? ముఖ్యంగా భారతీయులను, బంగారాన్ని వేర్వేరుగా చూడలేం. భారతీయులు ఇంట్లో చిన్న శుభకార్యం ఉన్నా, పెళ్లి అయినా ఏదైనా సరే బంగారం కొనాలని అనుకుంటారు. ఆఫీసులో కొంత డబ్బు బోనస్ గా వచ్చినా, మరేదైనా రూపంలో డబ్బు వచ్చినా, లేదా.. నెలల తరపడి డబ్బులు దాచి పెట్టి అయినా బంగారం కొంటూ ఉంటారు. కేవలం ఆభరణంగా మాత్రమే కాదు.. ఒక పెట్టుబడిగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే.. అవసరంలో తోడుగా ఉంటుందని నమ్ముతారు. అలాంటిది.. ఇప్పుడు పెరుగుతున్న ధర చూస్తుంటే.. మధ్యతరగతివారు బంగారం కొనడం సాధ్యం కాదు అనే భావన కలుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దాదాపు రూ.90 వేల వరకు ఉంది.
బంగారం ధర
రోజు రోజుకీ ఈ బంగారం ధర పెరుగుతోంది తప్ప, తగ్గేలా కనపడటం లేదు. త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరుకునే అవకాశం కూడా ఉంటుందనే వాదనలు వినపడుతున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా మాత్రమే బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనపడుతోంది. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం (31.10 గ్రాములు) 3023 డాలర్లుగా ఉంది. గత రెండు రోజుల క్రితం ఈ ధర 3050 డాలర్లుగా ఉంది. కానీ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతుండటంతో బంగారం ధర కాస్త శాంతంగా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధర క్రమంగా రూ. 400 వరకు తగ్గుతూ వస్తోంది.
నేటి బంగారం ధర
అయినా ఇంకా 10 గ్రాముల బంగారం ధర రూ. 90 వేల దిగువకు రాలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,210 గా ఉంది. బంగారం ధర త్వరలో తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సద్దుమణగడం వంటి కారణాల వల్ల బంగారం ధర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సిటీ బ్యాంక్ అంచనా ప్రకారం 2025 సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 3500 డాలర్లు ఒక ఔన్స్ ఉంటుందని తెలిపింది.
బంగారం ధర పెరుగుదల
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం తగ్గుతూ రావడం, ట్రంప్ ఈ దిశగా అడుగులు వేయడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో బంగారంలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగింది. దీని కారణంగా బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతుండటంతో యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి. బంగారం ధర తగ్గుతూ ఉండటం దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 2800 డాలర్లకు తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే.. త్వరలోనే బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది.
ఆనంద్ శ్రీనివాసన్
ఈ లెక్క ప్రకారం బంగారం ధర త్వరలోనే రూ. 16 వేలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఆర్థిక సలహాదారు ఆనంద్ శ్రీనివాసన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీడియోలో, గత 6 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం రూ.200 వరకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం గ్రాము 10 వేలకు చేరువలో ఉంది. ఇంత త్వరగా పెరుగుతుందని ఊహించలేదని అన్నారు.