యూపీఐ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల యూపీఐ పేమెంట్స్‌ను కొందరు యాక్సెప్ట్ చేయడం లేదు. దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే.?
బెంగళూరులో వీధి బదుల వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులకు ఇటీవల రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. జీఎస్టీకి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ (UPI) ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షలకుపైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు.
25
బెంగళూరు ప్రాంతంలో ఎక్కువ మంది
ఈ నోటీసులు పొందిన వారిలో 80% మంది బెంగళూరు ప్రాంతానికి చెందిన వారు. అంతేకాదు, రూ.2 కోట్లకుపైగా లావాదేవీలు చేసిన 150 మంది, అలాగే రూ.80 లక్షలకుపైగా స్వీకరించిన 900 మంది వ్యాపారులు కూడా ఇందులో ఉన్నారు. ఈ డేటా ఆధారంగా జీఎస్టీ పరిధిలోకి వస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టారు.
35
నోటీసులు ఎవరికి వచ్చాయి?
2021–22 నుంచి 2024–25 మధ్య ఏదో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే పాన్ నంబరుతో రూ.40 లక్షలకుపైగా డిజిటల్ లావాదేవీలు జరిపినవారికి నోటీసులు పంపించారు. పన్ను చెల్లింపు, వ్యాపార స్వభావం, వసూలు వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరారు.
నోటీసులు రావడాన్ని చూసి వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని, వాణిజ్య పన్ను శాఖ కచ్చితంగా సమయం ఇస్తుందని, స్పష్టత ఇవ్వడం ద్వారా పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు, పూర్తి మినహాయింపున్న వస్తువుల వివరాలు ఇచ్చినట్లయితే, చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కంపోజిషన్ స్కీమ్ కింద జీఎస్టీ చెల్లిస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేయొచ్చని వారు సూచిస్తున్నారు.
55
నో యూపీఐ ప్లీజ్
నోటీసులు రావడంతో నగరంలో చాలా మంది దుకాణదారులు యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరించబోమని తేల్చి చెబుతున్నారు. మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్‌లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అని రాసిన పేపర్స్‌ను భర్తీ చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ స్వీకరించమని బోర్డులు వెలుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రోజువారి లాభాలు పొందే చిరు వ్యాపారులు ఇకపై తాము యూపీఐ ద్వారా డబ్బును స్వీకరించలేమని చెబుతున్నారు. ఇప్పుడీ అంశం డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థపై పెరుగుతోన్న అభద్రతకు సాక్ష్యంగా నిలుస్తోంది.