సహారా ఎడారిలో వరదలు: మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?

First Published | Oct 17, 2024, 10:28 PM IST

ప్రపంచంలోనే రెండో పెద్ద ఎడారి అయిన సహారాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది ఒకరకంగా వింత అనే చెప్పాలి. ఎండలు మండిపోయే ఎడారిలో వరదలు వినడానికి ఆశ్ఛర్యంగా ఉన్నా ఇది వాతావరణంలో వచ్చిన మార్పులను బయటపెడుతోంది. ఇది భవిష్యత్తులో రానున్న ప్రమాదాలకు సూచిక అని కొందరు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆఫ్రికా ఖండంలో 31% సహారా ఎడారి విస్తరించి ఉంది. ఇది తూర్పు నుండి పడమరకు సుమారు 4,800 కి.మీ. ఉత్తరం నుండి దక్షిణానికి 1,200 కి.మీ. ఉంటుంది. సహారా ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్న ఎడారి.​​​​​ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. సహారాకు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన అట్లాస్ పర్వతాలు, మధ్యధరా సముద్రం ఉన్నాయి. తూర్పున ఎర్ర సముద్రం, దక్షిణాన సహేల్ సరిహద్దులుగా ఉన్నాయి.
 

సహారాకు బయట పుట్టి ప్రవహించే అనేక నదులు ఎడారిపై భాగంలో నీరు, భూగర్భజలాలపై ప్రభావం చూపుతుంటాయి. వీటి కారణంగా అప్పుడప్పుడూ సహారాలో వరదలు వస్తుంటాయి. దక్షిణాన ఉష్ణమండల ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతున్న నదులు ప్రత్యేకించి ప్రముఖమైనవి. ప్రధానంగా నైలు నది సహారాలో కలుస్తుంది. భారీగా నీరున్న చాడ్ సరస్సు కూడా ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రాంతీయ జలాశయాల రీఛార్జ్‌కు దోహదం చేస్తుంది. దినైజర్, లిబియా ,ట్యునీషియా , అల్జీరియా, మొరాకో సహారాలో అదనపు నీటిని అందించే వనరులుగా ఉన్నాయి.  
 

Latest Videos


ఆగ్నేయ మొరాకోలో భారీ వర్షాలు
ప్రసుత్తం సహారాలోని ఆగ్నేయ మొరాకోలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వల్ల ఎండిపోయిన సరస్సులు నిండిపోయాయి. దీంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ మండే ఎండలతో భగభగలాడే సహారా చల్లని నీటితో కళకళలాడుతోందని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇసుక తుఫానులు వచ్చే సహారాలో వరదలు రావడం ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం చూపుతుందని ఆందోళన నెలకొంది. టగౌనైట్ గ్రామంలో కేవలం 24 గంటల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సుమారు 50 ఏళ్లుగా ఎండిపోయిన ఈ సరస్సు మళ్ళీ నీటితో నిండిపోయింది.

టగౌనైట్ గ్రామంలో భారీ వర్షపాతం

ఆగ్నేయ మొరాకోలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సహారా ఎడారిలోని చాలా ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. రాజధాని రబాత్ కి 450 కి.మీ. దక్షిణాన ఉన్న టగౌనైట్ గ్రామంలో సెప్టెంబర్‌లో కేవలం 24 గంటల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు.

ఇరికి సరస్సు మళ్ళీ నిండిపోయింది

నాసా ఉపగ్రహ చిత్రాల ప్రకారం జగోరా, టాటా మధ్య సుమారు 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు వరదల వల్ల మళ్ళీ నిండిపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని మొరాకో వాతావరణ సంస్థ తెలిపింది.
 

సహారా ఎడారిలో భూతాప ప్రభావం

ఉత్తర, మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో 9 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న సహారా ఎడారి, భూతాపం కారణంగా విపరీత పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో అతి భారీ వర్షాలు, తుఫానులు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జలచక్రం వేగవంతమైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో అన్నారు. మండే ఎండలు, ఇసుక తుఫానులు, ఇసుక పర్వతాల లోయలతో భయంకరంగా ఉండే సహారాలో భూమి వేడి ప్రభావం ఉంటుందో భవిష్యత్తులో జరిగే సంఘటనలను అనుసరించి గుర్తించాలి.
 

click me!