కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919 నవంబర్ 11న ముంబైలో సేథ్ సీతారాం పొద్దార్ అనే వ్యక్తి స్థాపించారు. ఈ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయాన్ని అప్పట్లో మహాత్మా గాంధీ ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ బ్యాంకుకు కేవలం నాలుగు బ్రాంచిలు మాత్రమే ఉన్నాయి. 1969లో భారత ప్రభుత్వం UBIని జాతీయం చేసింది. ఆ సమయానికి ఈ బ్యాంకు 240 శాఖలను కలిగి ఉంది. బెల్గాం బ్యాంక్, శ్రీ జడేయా శంకర్లింగ్ బ్యాంక్, మిరాజ్ స్టేట్ బ్యాంక్, సిక్కిం బ్యాంక్‌లను కొనుగోలు చేసి తనలో కలిపేసుకుంది. అంతేకాకుండా 2019 ఆగస్టు 30న ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. UBI ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతానికి ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 8500 కి పైగా శాఖలున్నాయి. దాదాపు 75,000 మంది ఉద్యోగులతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుస్తోంది.